చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 138 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 57 బంతుల్లో 77 పరుగులు చేసి సూపర్ కింగ్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 35 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే 2 వికెట్లు తీశాడు.
టాస్ ఓడిన సన్ రైజర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి (21), మయాంక్ అగర్వాల్ (2)లను జడేజా పెవిలియన్ చేర్చి సన్ రైజర్స్ కు షాకిచ్చాడు. ఓపెనర్ హ్యారీ బ్రూక్ 18 పరుగులు చేసి ఆకాశ్ సింగ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. కెప్టెన్ మార్ క్రమ్ 12, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ 17 పరుగులు చేశారు. మార్కో జాన్సెన్ 17 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. చెన్నై ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది. సన్ రైజర్స్ 6 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు సాధించింది.