రాజస్థాన్‌ను ఓడించిన చెన్నై.. మూడో స్థానానికి చేరుకున్న సీఎస్‌కే

ఐపీఎల్ లో ఈ రోజు జ‌రిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించడం ద్వారా చెన్నై ప్లేఆఫ్ ఆశ‌ల‌ను మెరుగుప‌రుచుకుంది.

By Medi Samrat  Published on  12 May 2024 2:00 PM GMT
రాజస్థాన్‌ను ఓడించిన చెన్నై.. మూడో స్థానానికి చేరుకున్న సీఎస్‌కే

ఐపీఎల్ లో ఈ రోజు జ‌రిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించడం ద్వారా చెన్నై ప్లేఆఫ్ ఆశ‌ల‌ను మెరుగుప‌రుచుకుంది. అయితే పాయింట్ల‌ పట్టికలో రెండవ స్థానంలో ఉన్న రాజస్థాన్ మాత్రం ప్లేఆఫ్ చేరుకునేందుకు మాత్రం ఓ విజ‌యం దూరంలో ఉండిపోయింది. చెన్నై జట్టు 13 మ్యాచ్‌లు ఆడి ఏడు విజయాలు, ఆరు ఓటములతో 14 పాయింట్లతో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకగా.. రాజస్థాన్ జట్టు 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు, నాలుగు ఓటములతో 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 35 బంతుల్లో 47 పరుగులతో రియాన్ పరాగ్ అజేయ ఇన్నింగ్స్ ఆధారంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 141 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 18.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 145 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది. చెన్నై తరఫున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 41 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాజస్థాన్‌ తరఫున ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండు వికెట్లు తీశాడు. అంత‌కుముందు సిమర్‌జిత్‌ సింగ్‌, తుషార్‌ దేశ్‌పాండేల అద్భుత బౌలింగ్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ను 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులకే పరిమితం చేసింది.

Next Story