ఇదేం ఊచ‌కోత‌.. 103 బంతుల్లోనే 'డబుల్ సెంచరీ' బాదేశాడు..!

ఫోర్ట్ ట్రోఫీ వన్డే టోర్నీలో ఆరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ జాసన్ బోవ్స్ చరిత్ర సృష్టించాడు.

By Kalasani Durgapraveen  Published on  23 Oct 2024 6:38 AM GMT
ఇదేం ఊచ‌కోత‌.. 103 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదేశాడు..!

ఫోర్ట్ ట్రోఫీ వన్డే టోర్నీలో ఆరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ జాసన్ బోవ్స్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించి చాడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో కాంటర్‌బరీ బ్యాట్స్‌మెన్ చాడ్ బోవ్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్, భార‌త్‌కు చెందిన‌ నారాయణ్ జగదీశన్ రికార్డులను బద్దలు కొట్టాడు.

అక్టోబర్ 23న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ చాడ్ బోవ్స్ డబుల్ సెంచరీతో లిస్ట్ 'ఎ' వన్డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని నమోదు చేశాడు. కాంటర్‌బరీ కింగ్స్ ఓపెనర్ చాడ్ బోవ్స్ ఒటాగో వోల్ట్స్‌పై కేవలం 103 బంతుల్లో 200 పరుగులు చేసి.. మునుపటి ట్రావిస్ హెడ్ రికార్డును 11 బంతుల తేడాతో బద్దలు కొట్టాడు. ట్రావిస్ హెడ్‌ దక్షిణ ఆస్ట్రేలియా తరపున ఆడుతున్నప్పుడు 114 బంతుల్లో లిస్ట్ Aలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. 2022 విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో తమిళనాడు ఓపెనర్ నారాయణ్ జగదీశన్ కూడా అరుణాచల్ ప్రదేశ్‌పై 114 బంతుల్లో 200 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో చాడ్ బోవ్స్ 110 బంతులు ఎదుర్కొని 27 ఫోర్లు, 7 సిక్సర్లతో 205 పరుగులు చేశాడు. అతని డబుల్ సెంచరీ సాయంతో జట్టు భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో చాద్ బౌస్‌తో పాటు జాకరీ ఫౌల్క్స్ 49 పరుగుల చేశాడు. దీంతో కాంటర్‌బరీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 343 పరుగులు చేసింది.

చాడ్ బోవ్స్ క్రికెట్ కెరీర్ గురించి చెప్పాలంటే.. అతను ఇప్పటివరకు న్యూజిలాండ్ తరపున 6 వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫోర్డ్ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంత‌కుముంతు జామీ హౌ (2012–13 సీజన్‌లో 222) డబుల్ సెంచ‌రీ చేశాడు.


Next Story