ఆస్ట్రేలియా పర్యటనలో మూడో టెస్టులో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన అభిమానులను గుర్తించలేకపోయామని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో చెప్పింది. స్టాండ్స్ నుంచి బయటకు పంపిన ఆరుగురు ప్రేక్షకులు అసలు దోషులు కాదని విచారణలో తేలిందని ఐసీసీకి అందించిన నివేదికలో సీఏ వెల్లడించింది. సిరాజ్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయగా.. భారత్ దీనిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యావత్ క్రికెట్ ప్రపంచం స్పందించింది. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
భారత ఆటగాళ్లను గేలి చేసిన మాట వాస్తవమేనని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ విభాగం హెడ్ సీన్ కారోల్ వెల్లడించారు. ఈ విషయంలో తమ సొంత విచారణ కూడా సాగుతోందని, అందుబాటులోని సీసీటీవీ ఫుటేజ్ లను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన మ్యాచ్ కి సంబంధించిన టికెట్ల విక్రయం వివరాలు కూడా సేకరించామన్నారు.
క్రికెటర్లు జాతి వివక్ష వ్యాఖ్యలకు గురయ్యారని భావిస్తున్నప్పుడు విచారణాధికారులు మాత్రం దోషులను ఎందుకు గుర్తించలేకపోతున్నారని అక్కడి స్థానిక పత్రిక ప్రచురించింది. అంతముందు తన ఓవర్‌లో రెండు సిక్స్‌లు పోయినందుకు కలత చెందిన సిరాజ్.. ప్రేక్షకుల్లో ఒకరు వెల్‌కమ్ టు సిడ్ని సిరాజ్ అన్నందుకు అంపైర్ వద్దకు వెళ్లినట్లు గెంటివేతకు గురైన ఓ ప్రేక్షకుడు చెప్పాడని ఆ పత్రిక తెలిపింది.