ఆ విషయం బుమ్రాకు కూడా తెలుసు : అగార్కర్
మే 24, శనివారం భారత క్రికెట్ జట్టు కొత్త టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.
By Medi Samrat
మే 24, శనివారం భారత క్రికెట్ జట్టు కొత్త టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ తో జరిగిన త్రిముఖ పోటీలో గిల్ విజేతగా నిలిచాడు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టుకు నాయకత్వం వహించిన బుమ్రాను ఆ పాత్ర నుండి తొలగించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బుమ్రాను భారత టెస్ట్ కెప్టెన్‌గా ఎందుకు నియమించలేదో వివరించారు. టెస్ట్ కెప్టెన్సీ అదనపు భారాన్ని మోయడం కంటే, బుమ్రా తన పనిభారం సమస్యలపై దృష్టి పెట్టాలని భారత క్రికెట్ బోర్డు కోరుకుంటున్నట్లు అగార్కర్ అన్నారు. ఈ నిర్ణయాన్ని బుమ్రాకు తెలియజేశామని, బోర్డు ఇచ్చిన వివరణతో బుమ్రా సరేనని అన్నారని అగార్కర్ చెప్పారు.
అజిత్ అగార్కర్ రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా చేయడానికి కారణమేమిటో చెప్పాడు. ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించగా.. అందులో శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా, పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రిషబ్ పంత్ 2020 నుండి టెస్టు ఫార్మాట్‌లో భారత్ తరుపున అత్యుత్తమ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. అతడు స్వదేశంలో, విదేశాలలో అనేక మ్యాచ్‌లను మార్చే ఇన్నింగ్స్‌లు ఆడాడన్నారు. వికెట్ వెనుక నుండి ఆటను చదవడంలో పంత్ కు అవగాహన అద్భుతంగా ఉందని అన్నారు.