తప్పిన ఫాలో-ఆన్ గండం.. డ్రా దిశగా మూడో టెస్టు
బిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
By Medi Samrat Published on 17 Dec 2024 3:54 PM ISTబిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ బ్యాటింగ్ ఫాలో-ఆన్ నుంచి టీమిండియాను కాపాడింది. ఇద్దరూ అజేయంగా ఉన్నారు. అంతకుముందు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి అర్ధ సెంచరీలు సాధించారు. ఆకాష్ 27 పరుగులతో, బుమ్రా 10 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య 10వ వికెట్‌కు 54 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యం ఉంది. ఇప్పటి వరకు ఇద్దరూ తొమ్మిది ఓవర్లు బ్యాటింగ్ చేశారు. వారిద్దరూ మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, నాథన్ లియాన్ వంటి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. తొలి ఇన్నిగ్సులో టీమిండియా ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలోఆన్ గండం గట్టెక్కాలంటే భారత్ 246 పరుగులు చేయాల్సి వచ్చింది.
ఆకాష్ ఫోర్ కొట్టి ఫాలో ఆన్ నుండి టీమిండియాను కాపాడాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఉత్సాహంగా తమ కుర్చీలపై నుంచి దూకారు. ముగ్గురూ ఒకరికొకరు హై ఫైవ్స్ ఇచ్చుకున్నారు. ఆకాష్, బుమ్రా డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వస్తుంటే ముగ్గురూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అభిమానులు కూడా వీరిద్దరికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఫాలో ఆన్ నుండి కాపాడిన ఆకాష్ ఓ పవర్ ఫుల్ సిక్సర్ కూడా కొట్టాడు. ఇంకా ఒక్కరోజు ఆట మిగిలి ఉంది. ఈ టెస్టు డ్రా దిశగా సాగుతోంది.
మంగళవారం భారత్ నాలుగు వికెట్లకు 51 పరుగుల వద్ద ఆట ప్రారంభించింది. అయితే వెంటనే రోహిత్ శర్మ రూపంలో జట్టుకు ఐదో దెబ్బ తగిలింది. 10 పరుగులు చేసిన తర్వాత రోహిత్ కమిన్స్‌కు బలయ్యాడు. అనంతరం జడేజాతో కలిసి రాహుల్ 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రాహుల్ 139 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసి సెంచరీ మిస్ అయ్యాడు. అనంతరం నితీష్‌రెడ్డి, రవీంద్ర జడేజా ఏడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 16 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్‌లో నితీష్ అవుటయ్యాడు. సిరాజ్ ఒక పరుగు చేసి అవుటయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న జడేజా తన టెస్టు కెరీర్‌లో 22వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. జడేజా 123 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు చేశాడు. ఆ తర్వాత బుమ్రా, ఆకాష్‌లు ఫాలో ఆన్ ఆడకుండా భారత్‌ను కాపాడారు. ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని మరింత తగ్గించేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు.