ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. టాప్-10లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్లు

ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, ప్రస్తుత వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లి ర్యాంకులు మెరుగ‌వ‌గా.. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ మాత్రం నష్టపోయాడు

By Medi Samrat  Published on  28 Aug 2024 4:34 PM IST
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. టాప్-10లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్లు

ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, ప్రస్తుత వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లి ర్యాంకులు మెరుగ‌వ‌గా.. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ మాత్రం నష్టపోయాడు. బాబర్ ఆరు స్థానాలు కోల్పోయాడు. అయితే బాబర్ మాత్రం టాప్-10లో తన స్థానాన్ని ఎలాగోలా నిలబెట్టుకుంటున్నాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిని చవిచూసింది. టెస్టుల్లో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్‌కు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ బ్యాట్ నుంచి ప‌రుగులేమీ రాలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో అతను డక్ అవుట‌వ‌గా.. రెండవ ఇన్నింగ్స్‌లో 22 పరుగులు మాత్రమే చేశాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్లు నిలిచారు. టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రోహిత్ భాగస్వామి యశస్వి ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. బాబర్ ఆరు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

భారత్‌ ఇటీవల ఏ టెస్ట్ సిరీస్ ఆడలేదు. అయినా యశస్వి, కోహ్లీ ర్యాంకింగ్స్ మెరుగ‌వ‌గా.. బాబర్ రెండు ఇన్నింగ్స్‌లు ఆడిన తర్వాత కూడా ర్యాంకింగ్స్‌లో పడిపోయాడు.

ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం ఎగబాకి 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించిన పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఏడు స్థానాలు ఎగబాకి ఖవాజాతో ఉమ్మడిగా 10వ స్థానానికి చేరుకున్నాడు. సౌద్ షకీల్ ర్యాంకింగ్ ఒక స్థానం మెరుగుపడి 13వ స్థానానికి చేరుకున్నాడు.

Next Story