వెండితెరపై రియల్ హీరో జర్నీ.. యువరాజ్ బయోపిక్ ప్రకటన
2011లో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు
By Medi Samrat Published on 20 Aug 2024 3:04 PM IST2011లో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ 'మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డు అందుకున్నాడు. ఒకవైపు మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తుంటే.. మరోవైపు అతని శరీరం క్యాన్సర్‌తో పోరాటం చేస్తుంది. అయితే.. ఆ తర్వాత యువరాజ్ సింగ్ క్యాన్సర్‌తో పోరాడి.. ఆ తీవ్రమైన వ్యాధిని ఓడించి నిజ జీవిత యుద్ధంలో గెలిచాడు. ఇప్పుడు యువరాజ్ కథను అభిమాన లోకం వెండి తెరపై చూడనుంది.
తాజాగా యువరాజ్ సింగ్ బయోపిక్‌ను ప్రకటించారు. ఈ బయోపిక్‌ని టి-సిరీస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. భూషణ్ కుమార్, రవి భాగచంద్కా ఈ బయోపిక్‌ని నిర్మించనున్నారు. T-సిరీస్ యజమాని భూషణ్ కుమార్, రవి భాగ్‌చంద్కాతో కలిసి యువరాజ్ సింగ్ బయోపిక్‌ను ప్రకటించారు. యువరాజ్ సింగ్ జర్నీ మొత్తం ఈ సినిమాలో చూపించనున్నారు.
బయోపిక్‌పై యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నా క్రికెట్ ప్రయాణాన్ని ప్రదర్శించడానికి భూషణ్ జీ, రవి జీ సిద్ధంగా ఉన్నందుకు.. నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ అంటే నాకు చాలా ప్రేమ.. అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని నా బలానికి మూలం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, లక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి ఈ చిత్రం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.
సహ నిర్మాత రవి భాగ్‌చంద్కా మాట్లాడుతూ.. యువరాజ్ నాకు చాలా కాలంగా మంచి స్నేహితుడు. తన క్రికెట్ జర్నీని సినిమాగా మార్చేందుకు మమ్మల్ని ఎంచుకున్నందుకు సంతోషంగా ఉంది. యువీ ప్రపంచ ఛాంపియన్ మాత్రమే కాదు నిజమైన లెజెండ్ అని కొనియాడాడు. అయితే హీరో, దర్శకుడిని నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు.