భారీ షాక్‌.. వ‌చ్చిందే 4 పాయింట్లు అందులో 2 కోత‌

Big blow for India and England face heavy penalty due to slow over rate.ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌ను విజ‌యంతో ఆరంభించే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2021 2:48 PM IST
భారీ షాక్‌.. వ‌చ్చిందే 4 పాయింట్లు అందులో 2 కోత‌

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌ను విజ‌యంతో ఆరంభించే గొప్ప అవ‌కాశం పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు. దీంతో తొలి టెస్టును భార‌త జ‌ట్టు డ్రాతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక లార్డ్స్ వేదిక‌గా రెండవ టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో భారత్, ఇంగ్లాండ్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. ఇరు జట్లకు జరిమానా విధించింది. తొలి టెస్టులో స్లోఓవ‌ర్ రేటు(నెమ్మ‌దిగా ఓవ‌ర్లు వేయ‌డ‌మే) ఇందుకు కార‌ణం.

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌(డ‌బ్ల్యూటీసీ)-2లో భాగంగా జ‌రుగుతున్న తొలి టెస్టులోనే ఇలా జ‌ర‌డం గ‌మ‌నార్హం. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్, ఇంగ్లాండ్ జట్లతో వరుణుడు దోబూచులాడిన విషయం తెలిసిందే. మొదటి మరియు నాలుగవ రోజు మాత్రమే ఆట సజావుగా సాగింది. రెండు, మూడు రోజుల్లో మూడో సెషన్ ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఐదవ రోజు అయితే ఒక్క బంతి కూడా పడలేదు. అయితే ఆట జరిగిన రోజుల్లో కూడా భారత్, ఇంగ్లాండ్ జట్లు స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేశాయి. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువగా వేశాయి. దీంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఇరు జట్ల ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40% కోత విధించాడు. అంతేకాదు.. ఇరు జ‌ట్ల‌కు ల‌భించిన నాలుగు పాయింట్ల‌లో చెరో రెండు పాయింట్లు కోత పెట్టాడు.

మ్యాచ్ డ్రా కావడంతో కొత్త డబ్ల్యూటీసీ రూల్స్ ప్రకారం భారత్, ఇంగ్లాండ్ జట్లకు చెరో నాలుగు పాయింట్లు వచ్చాయి. జ‌రిమానా విధించ‌డంతో ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్ల ఖాతాలో చెరో రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో.. గెలిచిన జ‌ట్టుకు 12 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు, మ్యాచ్ డ్రాగా ముగుస్తే 4 పాయింట్లు ల‌భిస్తాయి.

Next Story