నేటి నుంచే గులాబి పోరు.. అందరి చూపు విరాట్‌పైనే
Bengaluru ready for pink hue.రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నేటి నుంచి
By తోట వంశీ కుమార్ Published on 12 March 2022 8:18 AM ISTరెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నేటి నుంచి ఆరంభం కానున్న డే అండ్ నైట్ టెస్టులో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూపం చూపించడంతో తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. ప్రస్తుతం సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లోనూ జోరు కొనసాగించి శ్రీలంకను వైట్ వాష్ చేయాలని బావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫామ్.. బలాబలాలు చూసుకుంటే టీమ్ఇండియా ప్రత్యర్థి శ్రీలంక కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది.
విరాట్ శతకం బాదేనా..?
విరాట్ కోహ్లీ శతకం చేసి రెండేళ్లు దాటింది. చివరిసారిగా కోహ్లీ 2019లో కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డే అంట్ నైట్ టెస్టులో సెంచరీ చేయడం గమనార్హం. మళ్లీ ఇప్పుడు గులాబీ పోరు అతడిని ఊరిస్తోంది. తనకు రెండో హోం గ్రౌండ్ లాంటి చిన్నస్వామి స్టేడియంలో పూర్తిగా ప్రేక్షకులు నిండిపోయిన స్టేడియంలో విరాట్ 71వ శతకం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ బాగానే ఉన్నా.. ఒకప్పటిలా అర్థశతకాలను శతకాలుగా మలచలేకపోతున్నాడు.
ఇక ఎప్పటిలాగే మయాంక్ అగర్వాల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ఆరంబించనున్నాడు. మూడో స్థానంలో హనుమ విహారి, నాలుగో స్థానంలో కోహ్లి ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్, పంత్, జడేజాలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా.. ఆ తర్వాత అశ్విన్ కూడా సత్తా చాటగలడు. బుమ్రా, షమీ ఖాయం కాగా స్పిన్నర్ జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడిస్తారా లేక.. గులాబీ బంతి స్వింగ్ అయ్యే అవకాశం ఉండడంతో మరో పేసర్‌గా సిరాజ్‌కు అవకాశం ఇస్తారా..? అని చూడాల్సి ఉంది.
తొలి టెస్టులో ఘోర ఓటమితో ఇప్పటికే డీలా పడ్డ శ్రీలంకను తాజాగా ఆటగాళ్ల గాయాలు వేదిస్తున్నాయి. వెన్నముక గాయంతో బ్యాటర్ నిశాంక ఈ మ్యాచ్‌కు దూరం కావడం లంకకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. పేసర్ లాహిరు కుమార గాయంతో రెండో టెస్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో ఎంపిక చేద్దామనుకున్న చమీర కూడా చీలమండ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. కుశాల్ మెండిస్‌తో పాటు ప్రవీణ్ జయవిక్రమ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అసలంక స్థానంలో దినేశ్ చండిమాల్‌ను ఆడించాలని లంక మేనేజ్‌మెంట్ బావిస్తోంది.
చిన్నస్వామి స్టేడియంలో ఉండే పిచ్ ఫ్లాట్‌గా ఉంటుంది. ఇది బ్యాటర్లకు స్వర్గధామం. మిగతా మైదానాలతో పోలిస్తే బౌండరీలు చిన్నగా ఉంటాయి. గులాబీ బంతి కావడంతో స్వింగ్ లభించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.