భార‌త ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ హెచ్చ‌రిక‌.. పాజిటివ్ వ‌స్తే సిరీస్‌కు దూరం..!

BCCI warns Indian players. ఆట‌గాళ్లంద‌రూ ఇంట్లోనే ఉండాల‌ని క‌రోనా బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని బీసీసీఐ.. ఆట‌గాళ్ల‌కు సూచించింద‌ట‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2021 2:00 PM IST
Team India

టెస్టు ఛాంఫియ‌న్ షిప్ ఫైన‌ల్‌, ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ఇండియా.. ఇంగ్లాండ్‌కు వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే ఇందులో పాల్గొన్న భారత జ‌ట్టును బీసీసీఐ(భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆట‌గాళ్లంద‌రూ ఇంట్లోనే ఉండాల‌ని క‌రోనా బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని బీసీసీఐ.. ఆట‌గాళ్ల‌కు సూచించింద‌ట‌. ఇంగ్లాండ్ విమానం ఎక్కేముందు.. ఒక‌వేళ ఎవ‌రైన‌ ఆట‌గాడికి పాజిటివ్ వ‌స్తే.. సిరీస్ మొత్తానికే దూరం కావాల్సిందేన‌ని తేల్చి చెప్పింది.

ప్ర‌స్తుతం ఆట‌గాళ్లంతా త‌మ ఇళ్లోనే ఉన్నారు. సిరీస్ సుధీర్ఘ‌మైన‌ది కావ‌డం, ఐసోలేష‌న్ వంటి ఆకంక్ష‌లు ఉండ‌డంతో.. ఆట‌గాళ్ల‌తో పాటు వారి కుటుంబ స‌భ్యుల‌ను తీసుకెళ్లేందుకు అనుమ‌తిస్తున్నారు. దీంతో.. ఈ నిబంధనలు కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాకుండా.. వారి కుటుంబ సభ్యులు మరియు సహాయక సిబ్బంది కూడా వర్తించనున్నాయి. తొలుత ఆట‌గాళ్లంతా ముంబై చేరుకుని అక్క‌డ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంద‌ని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.

ఆ స‌మ‌యంలో వారికి రెండు సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వ‌హిస్తారు. అందులో ఎవ‌రికి పాజిటివ్ వ‌చ్చినా భార‌త్‌లోనే ఉండిపోవాల‌ని, కోలుకున్న వారి కోసం త‌రువాత ఛార్ట‌ర్ విమానాలు ఏర్పాటు చేయబోమ‌న్నారు. ఇక ఇంగ్లాండ్‌కు వెళ్లాక టీమ్ఇండియా బృందం మొత్తం మ‌రో 10 రోజులు క్వారంటైన్ కానుంది. ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ 2021 వాయిదా పడిన నేపథ్యంలో బీసీసీఐ కఠిన నియమాలను అమలుచేస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌కు వెళ్లే ముందే ఆట‌గాళ్లంతా త‌ప్పనిస‌రిగా కొవిడ్ టీకా తీసుకోవాల‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. అంద‌రూ కోవిషీల్డ్ వేయించుకోవాల‌ని చెప్పింది. రెండో డోసును ఇంగ్లాండ్‌లో ఏర్పాటు చేయ‌నుంది. కొవిషీల్డ్ ఎందుకంటే.. ఇంగ్లాండ్‌లో అది అందుబాటులో ఉండ‌డ‌మే కార‌ణం.


Next Story