ఐపీఎల్ 2021.. రూల్స్‌లో కీల‌క మార్పులు.. సాప్ట్ సిగ్న‌ల్ ర‌ద్దు

BCCI removes 'soft signal' from IPL 2021.ఐపీఎల్‌) 2021సీజ‌న్‌కు సంబంధించి బీసీసీఐ(భారత క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి) మ్యాచ్ ప్లేయింగ్ రూల్స్‌లో ప‌లుమార్పులు చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2021 5:21 AM GMT
BCCI removes ‘soft signal’ from IPL 2021.ఐపీఎల్ 2021

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2021సీజ‌న్‌కు సంబంధించి బీసీసీఐ(భారత క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి) మ్యాచ్ ప్లేయింగ్ రూల్స్‌లో ప‌లుమార్పులు చేసింది. సాఫ్ట్ సిగ్నల్‌ను రద్దు చేసింది. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం అపెండిక్స్‌ డి- క్లాస్‌ 2.2.2.. ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. అంతేకాదు.. షార్ట్‌ రన్‌ను తేల్చే పనిని థర్డ్ అంపైర్‌కు అప్పజెప్పింది. ఏదైనా నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసినప్పుడు ఆన్‌ఫీల్డ్ ప్రధాన అంపైర్ చెప్పే అభిప్రాయాన్ని సాఫ్ట్ సిగ్నల్ అంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఇవి వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఔట్ విషయం ఇందుకు ప్రధాన ఉదాహరణ.

ఫీల్డర్ సందేహాస్పదంగా క్యాచ్ పట్టినప్పుడు.. ఫీల్డ్ అంపైర్ ఔట్‌పై తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌ని ఆశ్రయించేవాడు. ఆ సమయంలో తనవైపు నుంచి సాప్ట్ సిగ్నల్‌గా ఔట్ లేదా నాటౌట్‌ని అని ఫీల్డ్ అంపైర్ చెప్పేవాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ రిప్లైని పరిశీలించి.. స్పష్టమైన ఆధారాలు దొరకని సమయంలో.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడేవాడు. కొన్ని సందర్భాల్లో ఆధారాలు కనిపిస్తున్నా.. రిస్క్ తీసుకునేందుకు థర్డ్ అంపైర్ వెనుకంజ వేస్తున్నారు. దాంతో అంపైర్‌ నిర్ణయాలు వివాదాలుగా మారుతున్నాయి. ఐపీఎల్‌లో ఇలాంటి తప్పులు జరగకూడదనే సాప్ట్ సిగ్నల్ పద్ధతికి బీసీసీఐ స్వస్తి పలికింది.

ఇక రన్ చేసే క్రమంలో బ్యాట్స్‌మెన్ క్రీజును టచ్ చేయకుండా వెళ్లి పోతే దాన్ని షార్ట్‌రన్‌గా పరిగణించి ఆ పరుగును స్కోర్‌లోంచి తీసేస్తారు. ఇన్నాళ్లూ ఆన్‌ఫీల్డ్ అంపైర్లే దీన్ని గుర్తించాల్సి ఉన్నా చాలా సార్లు తప్పిదాలు చేశారు. దాంతో, షార్ట్ రన్స్ గుర్తించే బాధ్యతను కూడా బోర్డు థర్డ్ అంపైర్‌కే ఇచ్చింది. గత సీజన్‌లో షార్ట్ రన్ విషయంలో అంపైర్ నితిన్ మీనన్ చేసిన తప్పిదం కారణంగా పంజాబ్ కింగ్స్ భారీగా నష్టపోయింది. అంపైర్ తప్పిదం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపడంతో పాటు ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసింది. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 సీజ‌న్ ప్రారంభంకానుంది.
Next Story
Share it