టీ20 వరల్డ్ కప్ టీమిండియా కోచ్‌పై జై షా కీలక కామెంట్స్
ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ వరకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడే కొనసాగుతారని జై షా స్పష్టం చేశారు
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 3:36 PM IST
టీ20 వరల్డ్ కప్ టీమిండియా కోచ్‌పై జై షా కీలక కామెంట్స్
ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉండనుంది. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా చాంపియన్‌గా నిలుస్తుందని అభిమానులు భావించారు కానీ.. చివరి ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు భారత్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్‌లో ఎలాగైనా భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌తో ఇండియా వేదికగా టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తవగా 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు.
ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ వరకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడే కొనసాగుతారని జై షా స్పష్టం చేశారు. వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ద్రవిడ్‌తో మాట్లాడే అవకాశం దొరకలేదని జై షా అన్నారు. టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ అయ్యిందనీ.. ద్రవిడ్‌తో ఎలాంటి విషయాలను మాట్లాడలేకపోయామని చెప్పారు జై షా. రాజ్‌కోట్ టెస్టుకు ముందే అవకాశం దొరికిందని చెప్పారు. టీ20 వరల్డ్ కప్ వరకు ద్రవిడ్‌నే కోచ్‌గా కొనసాగాలని కోరామని జై షా అన్నారు. దానికి ద్రవిడ్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ద్రవిడ్ అనుభవం టీ20 వరల్డ్ కప్‌లో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. టీమిండియాను సమర్ధంగా ముందుండి నడిపిస్తారని జైషా చెప్పారు.
ద్రవిడ్‌తో పాటు సహాయక కోచింగ్ సిబ్బంది మొత్తం వరల్డ్ కప్ వరకు యధావిథిగా కొనసాగుతారని చెప్పారు. ఇక దీనికి ముందే వరల్డ్ కప్ టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండాని చెప్పిన విషయం తెలిసిందే.