టీమ్ఇండియాలోకి ఐపీఎల్ హీరోలు.. ఇంగ్లాండ్‌తో టీ20సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌

BCCI announces T20 squad against England. మార్చి 12 నుంచి భార‌త్‌-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య 5మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Feb 2021 11:10 AM IST
BCCI announces T20 squad against England

మార్చి 12 నుంచి భార‌త్‌-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య 5మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లాండ్‌తో త‌ల‌ప‌డే భార‌త టీ20 జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్ర‌క‌టించింది. విరాట్ కోహ్లీ సార‌థ్యంలో 19 మందితో కూడిన జ‌ట్టును ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స‌ర్లు బాదిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు రాహుల్ తెవాటియాతో పాటు కొంత‌కాలంగా నిల‌క‌డ‌గా రాణిస్తున్న ముంబై ఇండియ‌న్స్ ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌, ఇషాన్ కిష‌న్‌లు తొలిసారి జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. ఈ ఏడాది చివర్లో టీ20 వరల్డ్‌కప్‌కు భారత్ అతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఈ మెగా టోర్నీకి బలమైన జట్టు రెడీ చేసుకునేందుకు సెలెక్టర్లు ఇంగ్లాండ్ సిరీస్‌ను ఉపయోగించుకోనున్నారు. దాంతో యూఏఈ వేదికగా జరిగిన గత ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అవకాశం దక్కింది. రిషభ్‌ పంత్‌ జట్టులో ఉన్నా, రెండో వికెట్‌ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసి సంజుశాంస‌న్‌పై వేటు వేశారు. బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, మయాంక్ అగర్వాలను కూడా జట్టు నుంచి తప్పించారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్న స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి సెలక్టర్లు మరో అవకాశం కల్పించారు. గాయంనుంచి కోలుకొని భువనేశ్వర్‌ కుమార్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. బుమ్రాకు విశ్రాంతినివ్వ‌గా.. ఇంకా కోలుకోని మ‌హ్మ‌ద్ ష‌మీని ఎంపిక చేయ‌లేదు. లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు.


భార‌త టీ20 జ‌ట్టు ఇదే..

విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, ఇషాన్‌ కిషన్, యుజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్‌ చహర్, నవదీప్ సైనీ, శార్దుల్‌ ఠాకూర్


Next Story