అదరగొట్టిన అమ్మాయిలకు.. 5 కోట్ల రూపాయల నజరానా.!

ఫిబ్రవరి 2, కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో జరిగిన అండర్-19 మహిళల ప్రపంచ కప్ లో భారత్ విజయం సాధించింది.

By Medi Samrat  Published on  3 Feb 2025 11:00 AM IST
అదరగొట్టిన అమ్మాయిలకు.. 5 కోట్ల రూపాయల నజరానా.!

ఫిబ్రవరి 2, కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో జరిగిన అండర్-19 మహిళల ప్రపంచ కప్ లో భారత్ విజయం సాధించింది. దీంతో మహిళల జట్టుకు BCCI (బోర్డు ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా) రూ. 5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఫైనల్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది, టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచి వరుసగా ఏడు మ్యాచ్‌లు గెలిచి టైటిల్‌ను కాపాడుకుంది.

యువతుల అద్భుతమైన విజయాలను గౌరవించేందుకు, భారత క్రికెట్ బోర్డు జట్టు, సహాయక సిబ్బందికి నగదు బహుమతిని ప్రకటించింది. "భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మలేషియాలో జరిగిన ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025లో తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్నందుకు భారత అండర్-19 మహిళల జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది. ఈ అద్భుతమైన విజయాన్ని గౌరవించటానికి, ప్రధాన కోచ్ నూషిన్ అల్ ఖదీర్‌ నేతృత్వంలోని విజేత జట్టు, సహాయక సిబ్బందికి బీసీసీఐ 5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల టార్గెట్‌ను ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి భారత్ విజయాన్ని అందుకుంది. మొత్తంగా 11.2 ఓవర్లలోనే ఫైనల్ మ్యాచ్‌ లో ఛేదించి విశ్వ విజేతగా మహిళల టీమ్ నిలిచింది. తుదిపోరులో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్‌ వూరస్ట్ (23) టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్టవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు. 83 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి విశ్వవిజేతగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో త్రిష 44 పరుగుల చేసింది.

Next Story