సిడ్ని వేదికగా ఆస్ట్రేలియాతో రేపు జరుగనున్న మూడో టెస్టుకు తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే పేలవఫామ్‌లో ఇబ్బంది పడుతున్న మయాంక్ అగర్వాల్‌పై వేటు పడింది. అతడి స్థానంలో దాదాపు ఏడాది తరువాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ మళ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. శుభ్‌మన్‌గిల్‌తో కలిసి అతడు ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో నవదీప్ సైనీ స్థానం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌తో సైనీ టెస్టుల్లో అరంగ్రేటం చేయనున్నాడు.
నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమి తరువాత రెండో మ్యాచ్‌లో భారత జట్టు పుంజుకున్న తీరు అద్భుతం. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ గైర్హజరీలో అజింక్య రహానే నాయకత్వంలో మరోసారి విజయం సాధించాలని జట్టు భావిస్తోంది.
భారత జట్టు : అజింక్య రహానే(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్, సైనీ