ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో బెంగళూరు జట్టు అదరగొడుతోంది. సమిష్టిగా సత్తాచాటుతూ.. ఏడు మ్యాచుల్లో అయిదో విజయాన్ని సాధించిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువెళ్లింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌ను బెంగళూరు 18 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (96; 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మ్యాక్స్‌వెల్ (23), షాబాజ్ అహ్మద్ (26) లు రాణించారు. పరుగుల యంత్రం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగగా.. అనూజ్ రావత్ (4), ప్రభుదేశాయ్ (10) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో జాసెన్ హోల్డర్, దుష్మంత చమీర చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులకే పరిమితమైంది. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (42; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ కేఎల్ రాహుల్ (30; 24 బంతుల్లో 3 పోర్లు, 1 సిక్స్) రాణించినప్పటికీ మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. బెంగళూరు బౌలర్లలో హజిల్‌వుడ్ నాలుగు, హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టి లక్నోను కట్టడి చేశారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డు దక్కింది. ఏడు మ్యాచుల్లో లక్నోకి ఇది మూడో ఓటమి.