బాబ‌ర్ సిక్స్ తాకి విల‌విల్లాడిన అభిమాని.. వీడియో వైర‌ల్‌..!

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు జ‌రిగిన మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్ న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

By Medi Samrat  Published on  17 Jan 2024 2:45 PM IST
బాబ‌ర్ సిక్స్ తాకి విల‌విల్లాడిన అభిమాని.. వీడియో వైర‌ల్‌..!

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు జ‌రిగిన మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్ న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లోనూ బాబర్ అజామ్ అర్ధశతకం సాధించినప్పటికీ అతను జట్టును గెలిపించలేకపోయాడు. 37 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్సులో బాబర్ ఓ ప్రేక్షకుడిని తీవ్రంగా గాయపరిచాడు. బాబర్ కొట్టిన‌ సిక్స్‌కు ఆ అభిమాని నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపించాడు.

బాబర్ ఆజం బంతిని లెగ్ సైడ్ వైపు ఆడాడు. బంతి నేరుగా బౌండరీ లైన్ దాటింది. బంతి చాలా వేగంగా బౌండరీ లైన్ దగ్గర నిల‌బ‌డి బంతిని అందుకుందామ‌ని ప్ర‌య‌త్నించిన‌ ప్రేక్షకుడిని తాకింది. బంతి తగలడంతో అభిమాని నొప్పితో మెలికలు తిరుగుతూ నేలపై పడిపోయాడు. అత‌డి పరిస్థితి బాబర్‌కి కూడా కనిపించడంతో తలపై చేతులు వేసుకుని పశ్చాత్తాపపడ్డాడు. బాబర్‌ రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో ప్ర‌స్తుతం వైరల్‌ అవుతోంది. అయితే ఆ అభిమాని సేప్‌గా బ‌య‌ట‌ప‌డ‌టంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మూడో టీ-20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ బాబర్ అజామ్ పాకిస్థాన్ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. బాబర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 37 బంతుల్లో 58 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో బాబర్ 8 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అనంత‌రం ఇష్ సోధీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కి బాబర్‌ పెవిలియన్ చేరాడు.

మూడో టీ20లో న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. అనంతరం పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్‌ మినహా జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్‌లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.

Next Story