అజీమ్ ప్రేమ్‌జీ .. విప్రో అధినేత మాత్రమే కాదు గొప్ప దార్శనికులు కూడానూ..! ప్రస్తుతం జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ పద్ధతిపై ఆసక్తికర కామెంట్లు చేశారు. అజీమ్ ప్రేమ్‌జీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడుతూ ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యం ద్వారా కేవలం 60 రోజుల్లోనే 50 కోట్ల మందికి టీకా అందించవచ్చని తెలిపారు. భారత్‌లో రికార్డు స్థాయిలో టీకా ఉత్పత్తి జరుగుతోందని, టీకా పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక్కో టీకా డోసు రూ. 300 చొప్పున ఆస్పత్రులు, ప్రైవేటు నర్సింగ్ హోంలకు అందేలా సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకోవచ్చని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఒక్కరికి టీకా వేసింనందుకు రూ. 100 చొప్పున చెల్లించచ్చని.. ఒక్కో డోసు కోసం రూ. 400 ఖర్చు చూస్తే.. పెద్ద సంఖ్యలో ప్రజలకు టీకాలు అందేలా చేయవచ్చని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థలో సంస్కరణలు తేవాల్సిన అవసరాన్ని గుర్తు చేసే మేలుకొలుపే ఈ కరోనా సంక్షోభమని కూడా ప్రేమ్‌జీ తెలిపారు. బెంగళూరు ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటూ అజిమ్ ప్రేమ్‌జీ కూడా పాల్గొన్నారు.
భారతదేశంలో నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 14,199 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 9,695 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,05,850కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 83 మంది కరోనా కారణంగా మృతి చెందారు. భారతదేశంలో మృతుల సంఖ్య 1,56,385కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,99,410 మంది కోలుకున్నారు. 1,50,055 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,11,16,854 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యంత వేగంగా కోటి వ్యాక్సిన్లను వేసిన దేశంగా భారత్ నిలిచింది.