గాయ‌ప‌డిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఎంపికైంది మామూలోడు కాదు..!

గాయ‌ప‌డిన‌ భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని బీసీసీఐ భ‌ర్తీ చేసింది.

By -  Medi Samrat
Published on : 12 Jan 2026 4:02 PM IST

గాయ‌ప‌డిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఎంపికైంది మామూలోడు కాదు..!

గాయ‌ప‌డిన‌ భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని బీసీసీఐ భ‌ర్తీ చేసింది. తొలి వన్డేలో గాయపడిన సుందర్ వన్డే సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. సుందర్ స్థానంలో ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల ఆయుష్ బదోని జ‌ట్టులోకి ఎంపికయ్యాడు. ఆయుష్‌కి తొలిసారిగా టీమిండియా నుంచి పిలుపు వచ్చింది.

వడోదరలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతడి ఎడమ పక్కటెముక ప్రాంతంలో తీవ్ర‌మైన నొప్పి ఉంది. దాని కారణంగా అతడు 5 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత మైదానాన్ని వీడాడు. అతని బ్యాటింగ్‌పై సందేహం ఉండేది. కానీ విరాట్ కోహ్లి ఔట్ అయిన తర్వాత వ‌రుస వికెట్లు పడటంతో సుందర్ 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 7 బంతుల్లో 7 పరుగులు చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా అసౌకర్యంగా కనిపించాడు. దీని తరువాత అతనికి స్కాన్ జ‌రిగింది. పక్కటెముకల నొప్పి కారణంగా త‌దుప‌రి రెండు మ్యాచ్‌లకు కూడా దూర‌మ‌య్యాడు.

ఈ విష‌య‌మై అధికారిక సమాచారం ఇస్తూ BCCI.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనీని ఎంపిక చేసిన‌ట్లు తెలిపింది. రెండో వన్డేకు ముందు బదోని రాజ్‌కోట్‌లో భారత జట్టులో చేరనున్నాడని పేర్కొంది.

ఆయుష్ బదోని ఢిల్లీకి చెందిన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. అతడు బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్‌ను కూడా చేస్తాడు. శిఖర్ ధావన్‌, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లను తయారు చేసిన ఢిల్లీ ప్రసిద్ధ సోనెట్ క్రికెట్ క్లబ్ నుంచి వ‌చ్చిన మ‌రో ఆట‌గాడు ఆయుష్ బదోని కావ‌డం విశేషం.

రాహుల్ ద్రవిడ్.. బ‌దోని ప్రతిభను అండర్-19 ఆడుతుండ‌గానే గుర్తించాడు. అతడు శ్రీలంక అండర్-19 సిరీస్‌లో నంబర్-7లో బ్యాటింగ్‌కు వ‌చ్చి అద్భుతంగా ఆడాడు. ఒక ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 4 వికెట్లు కూడా తీసుకున్నాడు. అయితే అండర్-19లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సీనియర్ ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. అతడు వరుసగా రెండు సంవత్సరాలు IPL వేలంలో అమ్ముడుపోలేదు. కానీ 2022 సంవత్సరం అతని కెరీర్‌లో ఒక మలుపు. 2022 సంవత్సరంలో లక్నో సూపర్‌జెయింట్స్ (LSG) గౌతమ్ గంభీర్‌పై నమ్మకంతో అతన్ని జట్టులోకి తీసుకుంది. అతని మొదటి మ్యాచ్‌లో జట్టు 29 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి జ‌ట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. అతడు 41 బంతుల్లో 54 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని దూకుడు,మైదానంలోని ప్రతి మూలకు షాట్లు ఆడే అత‌డి సామర్థ్యాన్ని చూసి.. కెప్టెన్ KL రాహుల్ అతనికి 'BABYB' అనే పేరుతో పిలిచేవాడు.

ఆయుష్ బదోని క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 21 మ్యాచ్‌లు ఆడి 1681 పరుగులు చేయ‌డంతోపాటు 22 వికెట్లు కూడా తీశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో 27 మ్యాచ్‌లు ఆడి.. 693 పరుగులు, బౌలింగ్‌లో 18 వికెట్లు తీసిన రికార్డు అతని పేరిట ఉంది. టీ20లో 96 మ్యాచ్‌లు ఆడి 1788 పరుగులు చేయ‌డంతోపాటు బౌలింగ్‌లో 17 వికెట్లు తీశాడు.

Next Story