కివీస్ నడ్డి విరిచిన అక్షర్.. లాథమ్ సెంచరీ మిస్
Axar Patel Shines As India Reduce New Zealand To 249/6 At Tea.కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి
By తోట వంశీ కుమార్ Published on 27 Nov 2021 2:38 PM ISTకాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. సెంచరీకి ఐదు పరుగుల దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. మూడో రోజు రెండో సెషన్ ముగిసే సరికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. రెండో రోజు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత బౌలర్లు మూడో రోజు ఫర్వాలేదనిపించారు. అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్, జడేజాలు తలో వికెట్‌ను పడగొట్టారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కివీస్ ఇంకా 96 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
అంతకముందు ఓవర్ నైట్ స్కోర్ 129/0 తో మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్‌కు భారత బౌలర్లు అడ్డుకట్ట వేశారు. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 20 పరుగులు జోడించాక ఓపెనర్ విల్ యంగ్(89) ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో కివీస్ 151 పరగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇక్కడి నుంచి భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్ సన్(18)ను ఉమేశ్ యాదవ్ వికెట్ల ముందు దొరబుచ్చుకున్నాడు. దీంతో 197 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో అక్షర్ పటేల్ కివీస్ నడ్డి విరిచాడు. స్వల్ప వ్యవధిలో రాస్‌టేలర్(11), హెన్రీ నికోల్స్(2) లతో పాటు శతకానికి చేరువైన టామ్ లాథమ్(95; 282 బంతుల్లో 10 పోర్లు) ఔట్ చేశాడు. మరికాసేపటికే రచిన్ రవీంద్ర(13)ను జడేజా బౌల్డ్ చేయడంతో 241 పరుగుల వద్ద కివీస్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. టామ్ బ్లండెట్(10), జేమీసన్(2) మరో వికెట్ పడకుండా రెండో సెషన్‌ను ముగించారు.