పింక్ బాల్ టెస్టు.. భారత స్పిన్నర్ల జోరు.. 112 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్
Axar Patel Gets Six Wickets England All Out For 112.నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో 112 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2021 1:11 PM GMTనరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో భారత స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 48.2 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 6 వికెట్లతో రాణించగా.. అశ్విన్ 3, ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జాక్ క్రాలీ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ శర్మ ఆదిలోనే షాకిచ్చాడు. రెండో ఓవర్ మూడో బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన సిబ్లీ స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రెండు పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ క్రాలే బౌండరీలతో స్కోరును పెంచే ప్రయత్నం చేయగా.. వన్‌డౌన్‌లో బెయిర్ స్టోను అక్షర్ పటేల్ తన తొలి బంతికే పెవిలియన్ చేర్చాడు. ఓ చక్కటి బంతితో బెయిర్ స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 9 బంతులు ఆడిన బెయిర్ స్టో ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
ఈ దశలో క్రాలీకు కెప్టెన్ రూట్ జతకలిశాడు. వీరిద్దరు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ.. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో క్రాలే 67 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అశ్విన్ విడగొట్టాడు. 17 పరుగులు చేసిన రూట్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు అశ్విన్. రూట్ సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 74 పరుగుల వద్ద ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. మరో వైపు నిలకడగా ఆడుతున్న క్రాలీ మరికొద్ది సేపటిలో టీకి వెలుతారనరగా.. అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. క్రాలెను అక్షర్ ఎల్బీగా పెలివియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ 80 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి టీ విరామానికి వెళ్లింది.
ఇక రెండో సెషన్‌లో భారత బౌలర్లు విజృంభిండంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. అతి కష్టం మీద జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. భారత స్పిన్ ద్వయం అశ్విన్, అక్షర్‌ను ఎదుర్కొనడానికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు ముప్పుతిప్పలు పడ్డారు. స్టోక్స్ (6), పోప్ (1), ఫోక్స్ (12), ఆర్చర్ (11), లీచ్ (3), బ్రాడ్ (3) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ 112 పరుగులకే ఆలౌట్ అయింది.