విశాఖ వన్డేలో భారత్ ఘోర ఓటమి

Australia won by 10 wkts. విశాఖపట్నంలో వన్డేను ఎంజాయ్ చేద్దామని అనుకున్న వైజాగ్ వాసులకు ఊహించని షాక్ తగిలింది.

By Medi Samrat  Published on  19 March 2023 12:38 PM GMT
విశాఖ వన్డేలో భారత్ ఘోర ఓటమి

Australia won by 10 wkts


విశాఖపట్నంలో వన్డేను ఎంజాయ్ చేద్దామని అనుకున్న వైజాగ్ వాసులకు ఊహించని షాక్ తగిలింది. హోరాహోరీగా మ్యాచ్ సాగుతుందని అనుకోగా.. ఆస్ట్రేలియా భారత్ ను చిత్తు చిత్తు చేసింది. మొదట భారత్ ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్.. ఛేజింగ్ లో ఏ మాత్రం ఆగలేదు. దూకుడుగా ఆడుతూ 39 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు.

విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసి భారత్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. స్టార్క్ తో పాటూ షాన్ అబ్బాట్ 3, నాథన్ ఎల్లిస్ 2 వికెట్లతో విజృంభించడంతో టీమిండియా 26 ఓవర్లల్లో 117 పరుగులకే ఆలౌట్ అయింది. వన్డేల్లో టీమిండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. అక్షర్ పటేల్ 29 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. జడేజా 16 పరుగులు చేశాడు. టీమిండయా ఇన్నింగ్స్ లో కోహ్లీ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. శుభ్ మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ సున్నా పరుగులకే అవుటవ్వగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 13, కేఎల్ రాహుల్ 9, హార్దిక్ పాండ్యా 1 పరుగు చేసి వెనుదిరిగారు.

ఇక ఆసీస్ 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక పోయారు. ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ట్రావిస్ హెడ్ కూడా అర్ధసెంచరీ సాధించాడు. హెడ్ 30 బంతుల్లో 10 ఫోర్లు బాది 51 పరుగులు నమోదు చేశాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను ఆసీస్ 1-1తో సమం చేసింది. ఇక చివరిదైన మూడో వన్డే ఈనెల 22న చెన్నైలో జరగనుంది.


Next Story