ఓటమి బాధలో ఉన్న ఆసీస్ కు షాక్ ఇచ్చిన మ్యాచ్ రెఫరీ
Australia fined for slow over-rate in second Test against India. తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాభవానికి టీమ్ఇండియా
By Medi Samrat
తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాభవానికి టీమ్ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని రెండో వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కెప్టెన్ అజింక్యా రహానే (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (36 బంతుల్లో 35; 7 ఫోర్లు) రాణించడంతో భారత్ 15.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. వీరిద్దరు అభేద్యమైన మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఓటమి బాధలో ఉన్న ఆస్ట్రేలియాకు మ్యాచ్ రెఫరీ షాక్ ఇచ్చాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆసీస్ జట్టుకు 40 శాతం జరిమానా విధించారు. నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో ఆస్ట్రేలియాకు చాంపియన్‌షిప్ పాయింట్లలో కోతతో పాటు భారీ జరిమానా విధించారు. రెండు ఓవర్లు ఆలస్యంగా పడటంతో ఆసీస్‌కు నాలుగు టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లతో పాటు 40 శాతం జరిమానా పడింది. ఆర్టికల్ 16.11.2 నిబంధన ప్రకారం ఓవర్ ఆలస్యానికి రెండు టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లతో పాటు 20 శాతం ఫీజు కోత పడుతుంది. ఆసీస్ రెండు ఓవర్లు ఆలస్యం చేయడంతో నాలుగు పాయింట్లు, 40 శాతం మ్యాచ్ ఫీజును కోల్పోనుంది.
ఆసీస్ స్లో ఓవర్‌రేట్ నమోదు చేసిన విషయాన్ని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ధృవీకరించారు. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండానే ఆ జట్టుకు పాయింట్లలో కోతతో పాటు జరిమానా విధించారు.