సిడ్ని వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ముందు ఆసీస్ 407 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 312/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 94 కలుకుని టీమ్ఇండియా ముందు భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత్ మరో నాలుగు సెషన్ల పాటు నిలిస్తేనే.. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలుగుతుంది.ఓవర్‌నైట్ స్కోర్ 103/2 ఆదివారం నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ఆరంభంలోనే కీలక రెండు వికెట్లు కోల్పోయింది. మార్నస్ లబుషేన్ (73), మాథ్యూ వేడ్ (4) ఔటయ్యారు. ఇద్దరినీ నవదీప్ సైనీ పెవిలియన్ చేర్చాడు.
లబుషేన్, స్మిత్ (81) మూడో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. వీరిద్దరు కుదురుకన్నట్లే కనిపించగా.. సైనీ ఓ చక్కటి బంతితో లబుషేన్‌ను బోల్తా కొట్టించాడు. అనంతరం వేడ్ (4) సైతం పెవిలియన్ చేర్చాడు సైనీ. ఈ దశలో ఆ జట్టు కెప్టెన్ టీప్ పైన్(39), కామెరాన్ గ్రీన్(84) ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నాడు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో గ్రీన్.. టెస్టుల్లో తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. అనంతరం ధాటిగా ఆడే క్రమంలో గ్రీన్ ఔట్ కావడంతో.. వెంటనే ఆసీస్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్ మూడో టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే 407 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్‌ను డ్రా ముగించాలని అనుకున్నా కూడా నాలుగు సెషన్ల పాటు ఆసీస్ బౌలర్లను కాచుకోవాల్సి ఉంది.