వేడ్ విధ్వంసం.. పాక్‌కు షాక్‌..ఫైన‌ల్‌కు ఆసీస్‌

Australia beat Pakistan by 5 wickets to enter final.టీ20 క్రికెట్ అనిశ్చితికి మారు పేరు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2021 8:05 AM IST
వేడ్ విధ్వంసం.. పాక్‌కు షాక్‌..ఫైన‌ల్‌కు ఆసీస్‌

టీ20 క్రికెట్ అనిశ్చితికి మారు పేరు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రు చెప్ప‌లేరు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2021 మ్యాచ్‌లు అంచ‌నాల‌కు అంద‌డం లేదు. విజ‌యం త‌మ‌దే అన్న ధీమాతో ఉన్న జ‌ట్టు కొన్ని నిమిషాల్లో క‌న్నీరు పెడుతుండ‌గా.. ఓడిపోతామ‌ని దిగాలుగా ఉన్న జ‌ట్టు కాసేప‌ట్లోనే సంబ‌రాల్లో తేలిపోతున్నాయి. తొలి సెమీస్‌లో ఇలాగే జ‌రుగుగా.. ఇప్పుడు రెండో సెమీపైన‌ల్ మ్యాచ్‌లోనూ అదే క‌థ పునరావృతమైంది. ఇక మ్యాచ్ త‌మ‌దే అని గ‌ట్టి ధీమాతో ఉన్న పాకిస్థాన్ జ‌ట్టుకు ఆస్ట్రేలియా దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చింది. ఆల్‌రౌండ‌ర్ స్టాయినిస్ ఆసీస్‌ను పోటీలోకి తెస్తే.. చివ‌ర‌ల్లో వేడ్ క‌ళ్లు చెదిరే హ్యాట్రిక్ సిక్స‌ర్లుతో ఆసీస్‌కు మ‌రుపురాని విజ‌యాన్ని అందించాడు. దీంతో పైన‌ల్‌లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్పటి వ‌ర‌కు ఇరు జ‌ట్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌ని నేప‌థ్యంలో ఓ కొత్త ఛాంపియ‌న్‌ను చూడ‌బోతున్నాం.

దుబాయ్ వేదిక‌గా గురువారం రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్‌ రిజ్వాన్‌ (52 బంతుల్లో 67; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫఖర్‌ జమన్‌ (32 బంతుల్లో 55 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (39; 5 ఫోర్లు) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ రెండు ప‌డ‌గొట్ట‌గా.. కమిన్స్‌, జంపా చెరో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (30 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరంభంలో మెరుపులు మెరిపిస్తే.. మార్కస్‌ స్టొయినిస్‌ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ వేడ్‌ (17 బంతుల్లో 41 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగి మ‌రో ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే ఆసీస్‌కు విజ‌యాన్ని అందించారు. ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియాకిది ఐదో విజయం. ఇక ఆదివారం జ‌రిగే ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌ను ఆస్ట్రేలియా ఢీ కొట్ట‌నుంది.

ఆ క్యాచ్ చేజార‌కుండా ఉంటే..

ఆఖ‌రి రెండు ఓవ‌ర్లలో ఆసీస్ గెల‌వాలంటే 22 ప‌రుగులు కావాలి. 19 ఓవ‌ర్‌కు ష‌హీన్ అఫ్రిది బౌలింగ్ కు వ‌చ్చాడు. తొలి రెండు బంతుల్లో కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే ఇచ్చాడు. మూడో బంతికి వేడ్ డీప్ మిడ్ వికెట్ దిశ‌గా బంతిని గాల్లోకి లేపాడు. ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చిన హ‌స‌న్ అలీ.. బంతిని స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక క్యాచ్‌ను జార విడిచాడు. అంతే.. ల‌భించిన అవ‌కాశాన్ని చ‌క్క‌గా వినియోగించుకున్న వేడ్‌.. త‌రువాత మూడు బంతుల‌ను మూడు సిక్స‌ర్లుగా మ‌లచి ఆస్ట్రేలియాకు ఘ‌న విజ‌య‌న్ని హ‌న‌న్ అలీకి పీడ క‌ల‌ను మిగిల్చాడు.

Next Story