భారత్, శ్రీలంక మధ్య రేపు గువాహటిలో తొలి వన్డే జరగనుంది. టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ కూడా గెలవాలని భావిస్తోంది. టీ20 సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టుతో కలవనున్నారు. ఈ మ్యాచ్ విషయంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని కామ్‌రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో అభిమానులు మ్యాచ్ చూసేందుకు హాఫ్-డే సెలవు ప్రకటించింది. బర్సపరా స్టేడియం వేదికగా శ్రీలంక-భారత్ తొలి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా కామ్‌రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాఫ్ డే సెలవు ప్రకటించాం. ఈ నిర్ణయం పట్ల అస్సాం గవర్నర్ కూడా సంతోషం వ్యక్తం చేశారని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది.
ఇక గత రికార్డులను పరిశీలిస్తే.. టీమిండియాదే పై చేయి ఉంది. భారత్ – శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకూ 162 వన్డేలు జరిగాయి. వీటిలో భారత్ 93 మ్యాచుల్లో గెలిచింది. లంక 57 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అయింది. 11 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. భారత పర్యటనలో శ్రీలంక 41 వన్డేల్లో 30 ఓడిపోయింది. శ్రీలంక కేవలం 8 మ్యాచుల్లోనే గెలిచింది. 3 మ్యాచుల్లో ఫలితం తేలలేదు.