చైనాలోని హాంగ్‌జావ్ నగరంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా క్రీడలు-2022 వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆసియా ఒలిపింపిక్ కౌన్సిల్ ఈ విషయాన్ని ఓ ప్రకనటలో తెలిపింది. అయితే.. వాయిదా వేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. తదుపరి తేదీలను మరికొన్ని రోజుల్లో వెల్లడించనున్నట్లు తెలిపింది. కాగా.. చైనాలో కరోనా మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు చైనాలోని హాంగ్ జావ్ నగరంలో 19వ ఆసియా క్రీడలను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఆసియా, పారా క్రీడల కోసం 56 వేదికలు నిర్మించినట్లు నిర్వాహకులు ఇప్పటికే తెలియజేశారు. అయితే.. చైనాలోని షాంఘై నగరంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్‌ను విధించారు. హాంగ్‌జావ్ ప్రాంతం షాంఘైకి చాలా సమీపంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడలను వాయిదా వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.