అతను ఇంకా పసివాడే.. అలాంటి లక్ష్యం పెట్టకండి..!
By - Medi Samrat |
యువ భారత బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌పై అతను ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించడంలో సహాయపడింది. ఈ ఇన్నింగ్సు తరువాత అతడు వీలైనంత త్వరగా టీమ్ ఇండియాకు ఆడాలని చాలా మంది సీనియర్లు సూచించారు. భారత మాజీ ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దీనిని వ్యతిరేకించారు.
గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అతను 17 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తను వెళ్ళిన ప్రతిచోటా తన బ్యాట్‌తో సంచలనం సృష్టిస్తున్నాడు. అండర్-19 ప్రపంచ కప్‌లో జట్టు టైటిల్ గెలవడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు.
వైభవ్ ఇన్నింగ్స్ తర్వాత ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్, టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌లు అతను త్వరలోనే టీమ్ ఇండియా తరఫున ఆడాలని అన్నారు. మరోవైపు, ఆ యువ బ్యాట్స్‌మన్‌కు ఇంకా చాలా సమయం ఉందని అశ్విన్ అన్నారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. "అతనికి అలాంటి లక్ష్యం పెట్టకండి. అతను ఇంకా పెద్దవాడే కాలేదు, ఇంకా పసివాడు. ధోనీ 45 (44) ఏళ్ల వరకు, వైభవ్ 40 ఏళ్ల వరకు ఆడగలిగితే, అతనికి క్రికెట్‌లో ఇంకా రెండున్నర దశాబ్దాల కెరీర్ ఉంది. అతన్ని వదిలేయండి. సరైన సమయం వచ్చినప్పుడు అతనే వస్తాడు" అని అన్నారు. అతడు భారత్ తరఫున ఆడటానికి చాలా ఫిట్‌గా ఉన్నాడు. అతడు ఎప్పటికైనా ఆడతాడు. ఎప్పుడు ఆడతాడు? దాని కోసం మనం వేచి చూడాల్సి రావచ్చు. మనం ఎప్పుడూ ఎందుకు ఇంత తొందరపడతాం? అని అశ్విన్ ప్రశ్నించాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై, రాజస్థాన్ బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులు చేసింది. రాజస్థాన్ ఈ లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి చేరుకుంది. వైభవ్ ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి, అజేయంగా 38 పరుగులు చేశాడు.