దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ ఆటకు వీడ్కోలు పలికాక అతడి స్థానాన్ని భర్తీ చేశాడు చెతేశ్వర్ పుజారా. నయా వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు. కష్ట సమయాల్లో ఎన్నో సార్లు జట్టును ఆదుకున్నాడు. టెస్టుల్లో పుజారాని ఔట్ చేస్తే చాలు.. మ్యాచ్ గెలవవచ్చు అని ప్రత్యర్థి ఆటగాళ్లు భావిస్తుంటారు. అంతలా క్రీజులో పాతుకుపోతాడు పుజారా. అయితే.. పుజారా క్రీజు వదిలి ముందుకు వచ్చి అలా సిక్స్ కొట్టడం చూశారా..? అది కొంచెం కష్టమే. ఎందుకంటే.. అసలు క్రీజును విడిచిపెట్టనే పెట్టడు. టీమ్‌డియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా ఇదే చెబుతున్నాడు.
స్పిన్నర్ అశ్విన్ యూట్యూబ్ చానెల్‌లో అతనితో కలిసి మాట్లాడాడు. ఈ సందర్భంగా పుజారా గురించి మాట్లాడుతూ.. ఒక్కసారైనా క్రీజు బయటకు వచ్చి సిక్స్ కొట్టమని పుజారాకు నేను చెబుతున్నాను. కానీ అతడు మాత్రం వినడం లేదు. ఏవేవో కారణాలు చెబుతున్నాడు అని చెప్పాడు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న అశ్విన్.. పుజారాకు చిత్రమైన సవాలును విసిరాడు. ఇంగ్లాండ్‌తో వచ్చే సిరీస్‌లో ఏ స్పిన్నర్ బౌలింగ్‌లోనైనా ముందుకొచ్చి అతడి తలమీదుగా షాట్ ఆడితే.. సగం మీసం గీసుకుంటానని.. అలాగే ఆ మ్యాచ్‌లో ఆడతానని చెప్పాడు. ఈ చాలెంజ్ బాగుంది. అతడు దీనిని స్వీకరిస్తే బాగుంటుంది. కానీ పుజారా ఆ పని చేస్తాడని అనుకోవడం లేదు అని రాథోడ్ అన్నాడు.