అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లతో చెలరేగాడు. దాంతో ఓవర్ నైట్ స్కోరు 255/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 167.2 ఓవర్లలో 480 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. శుబ్ మన్ గిల్ (27 బంతుల్లో 18 బ్యటింగ్; ఫోర్, సిక్స్), రోహిత్ శర్మ (33 బంతుల్లో 17 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ మరో 444 పరుగులు వెనుకబడి ఉంది.
ఈ టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180) భారీ సెంచరీ, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (114) శతకం సాయంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా టెయిలెండర్లు టాడ్ మర్ఫీ 41, నాథన్ లైయన్ 34 పరుగులు చేసి భారత బౌలర్లను విసిగించారు. ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ 6 వికెట్లు తీయడం విశేషం. షమీ 2, జడేజా 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.