కివీస్ ముందు కొండంత లక్ష్యం.. టీ విరామానికి న్యూజిలాండ్ 14/1
Ashwin gets Latham early after India set 540 run target.ముంబైలోని వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న
By తోట వంశీ కుమార్ Published on 5 Dec 2021 9:23 AM GMTముంబైలోని వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 276/7 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(62; 108 బంతుల్లో 9పోర్లు, 1 సిక్స్), పుజారా(47; 97 బంతుల్లో 6పోర్లు), శుభ్‌మన్‌గిల్(47; 75 బంతుల్లో 4పోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్(41 నాటౌట్; 26 బంతుల్లో 3పోర్లు, 4సిక్సర్లు) లు రాణించారు. టిమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 263 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకుని కివీస్ ముందు టీమ్ఇండియా 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్ (6) అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో 13 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో విల్ యంగ్(7), డారెల్ మిచెల్(1) క్రీజులో ఉన్నారు. కివీస్ విజయానికి ఇంకా 527 పరుగులు కావాల్సి ఉండగా.. భారత జట్టు విజయానికి 9 వికెట్లు మాత్రమే కావాలి. ఇంకా రెండు రోజులకు పైగా ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం తేలడం ఖాయం. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుండడంతో కివీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే అద్భుతమే జరగాల్సి ఉంటుంది.