ఆ మూడు వికెట్లు తీస్తే దిగ్గజాలను దాటి చరిత్ర సృష్టించనున్న అర్ష్‌దీప్‌ సింగ్‌.!

భారత జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ సెయింట్ జార్జ్ పార్క్‌లో జరగనుంది

By Kalasani Durgapraveen  Published on  10 Nov 2024 5:56 PM IST
ఆ మూడు వికెట్లు తీస్తే దిగ్గజాలను దాటి చరిత్ర సృష్టించనున్న అర్ష్‌దీప్‌ సింగ్‌.!

భారత జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ సెయింట్ జార్జ్ పార్క్‌లో జరగనుంది. సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా రెండో టీ20లోనూ గెలిచి సిరీస్ ఆధిక్యం సాధించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

నేటి మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ అవ‌త‌రించ‌నున్నాడు. ఇందుకోసం అతను 3 వికెట్లు తీయాల్సి ఉంది. అర్ష్‌దీప్ సింగ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 57 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 18.43 సగటుతో 8.28 ఎకానమీతో 88 వికెట్లు తీశాడు. ఈ క్ర‌మంలోనే జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి దిగ్గజాలను దాటే అవకాశం అర్ష్‌దీప్ సింగ్‌కు ఉంది.

తన కెరీర్‌లో 70 టీ20లు ఆడిన బుమ్రా 69 ఇన్నింగ్స్‌ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. అలాగే, ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 87 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 86 ఇన్నింగ్స్‌లలో 90 వికెట్లు సాధించాడు. అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌లో బుమ్రా, భువనేశ్వర్‌ల రికార్డుల‌ను అధిగ‌మించాల‌ని చూస్తున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్‌ నిలిచాడు. చాహల్ 80 టీ20ల్లో 79 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. అతని సగటు 25.09 క‌గా ఎకాన‌మీ 8.19గా ఉంది.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్లు..

యుజ్వేంద్ర చాహల్: 96 వికెట్లు

భువనేశ్వర్ కుమార్: 90 వికెట్లు

జస్ప్రీత్ బుమ్రా: 89 వికెట్లు

అర్ష్‌దీప్‌ సింగ్‌: 88 వికెట్లు

హార్దిక్ పాండ్యా: 87 వికెట్లు

అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ అవ‌కాశం ఉంది. టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచే అవకాశం ఉంది. దీని కోసం హార్దిక్ పాండ్యా 4 వికెట్లు సాధించాల్సి ఉంటుంది. హార్దిక్ పాండ్యా తన కెరీర్‌లో ఇప్పటివరకు 106 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు అతడు 94 ఇన్నింగ్స్‌లలో 26.32 సగటుతో 8.18 ఎకానమీతో 87 వికెట్లు తీశాడు.

Next Story