కీలక నిర్ణయం తీసుకున్న అర్జున్ టెండూల్కర్.. ముంబైకి సెలవు
Arjun Tendulkar`s decision to play for Goa.సచిన్ కు ముంబై రంజీ జట్టుతో విడదీయరాని అనుబంధమున్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2022 1:14 PM ISTమాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ముంబై రంజీ జట్టుతో విడదీయరాని అనుబంధమున్న సంగతి తెలిసిందే. అయితే.. అతడి కుమారుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇన్నాళ్లు దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. ముంబైతో అనుబంధాన్ని తెంచుకోబోతున్నాడు. ముంబై జట్టులో సరైన అవకాశాలు రాకపోవడమే అందుకు కారణం. దీంతో అతడు వచ్చే సీజన్ నుంచి గోవా తరుపున ఆడబోతున్నాడు. ఈ మేరకు ముంబై రంజీ జట్టు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కూడా అప్లై చేశాడు.
2020-21 సీజన్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 22 ఏళ్ల అర్జున్ ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నీలో హర్యానా, పుదుచ్చేరిలతో జరిగిన మ్యాచ్‌లలో మాత్రమే అతడికి అవకాశం దక్కింది. ఆ తరువాత కూడా అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ సీజన్ 2021-22లో అతన్ని జట్టులో పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సైతం ముంబై ఇండియన్స్ జట్టులో ఉంటున్నా కూడా అరంగ్రేటం చేయలేకపోతున్నాడు. దీంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ముంబైతో ఉంటే ఇక లాభం లేదని బావించాడు.
అర్జున్ ప్రస్తుతం ఉన్న స్థితిలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. ముంబై నుంచి గోవాకు మారడం వల్ల అతడు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ ఆడే అవకాశం లభిస్తుందని బావిస్తున్నట్లు అర్జున్ ప్రతినిధి తెలిపాడు. ఇక అర్జున్ తమ జట్టులోకి రావడంపై గోవా క్రికెట్ సంఘం హర్షం వ్యక్తం చేసింది. తాము లెప్టార్మ్ పేసర్ కోసం ఎదురుచూస్తున్నామని, మిడిల్ ఆర్డర్లో పరుగులు చేసే ఆల్‌రౌండర్ కోసం వెతుకుతున్నామని, ఆ లోటును అర్జున్ భర్తీ చేస్తాడని బావిస్తున్నట్లు అధ్యక్షుడు సూరజ్ లొత్లీకర్ తెలిపాడు. ముందుగా కొన్ని ట్రయల్ మ్యాచుల్లో అర్జున్ ఆడిస్తాం.. అందులో అతడి ప్రదర్శనను బట్టే సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.