టీ20ల్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత
Another rare record in Rohit sharma's account.అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి జాబితాలో రెండో స్థానానికి రోహిత్ శర్మ చేరుకున్నాడు.
By తోట వంశీ కుమార్ Published on 21 March 2021 7:08 AM GMTటీమ్ఇండియా డాషింగ్ ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ మరో రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో శనివారం జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ 34 బంతుల్లో 4పోర్లు, 5 సిక్సర్లు బాది 64 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌ను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 3,103 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ 2,864 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. మార్టిన్ గుప్తిల్ 2,839 పరుగులో మూడో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌లాడి 2,864 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమ్ ఇండియా 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. మొదట ఓపెనర్లు కోహ్లీ(80; నాటౌట్ 52 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (64; 34 బంతుల్లో 4పోర్లు, 5 సిక్సర్లు)లకు తోడుగా సూర్యకుమార్ యాదవ్(32; 17 బంతుల్లో 3పోర్లు, 2 సిక్సర్లు). హార్థిక్ పాండ్య (39 నాటౌట్; 17 బంతుల్లో 4పోర్లు 5 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం డేవిడ్ మలన్(68; 46 బంతుల్లో 9 పోర్లు, 2 సిక్సర్లు) జోస్ బట్లర్(52; 34 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడి ఇంగ్లాండ్ శిబిరంలో ఆశలు రేపిన.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ భువనేశ్వర్ కుమార్(2/15), శార్దుల్ ఠాకూర్(3/45) వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులే పరిమితమైంది.