బంగ్లాదేశ్‌లో టెస్టు సిరీస్ లో భారత స్టాండ్-ఇన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. ఢాకాలోని మిర్పూర్‌లో రెండో టెస్టు మ్యాచ్ కోసం నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాహుల్ చేతికి గాయమైంది. భారత్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ కు దూరమవ్వడంతో రాహుల్ ప్రస్తుతం జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ విలేకరుల సమావేశంలో రాహుల్ గాయపడ్డాడని, ప్రస్తుతం అతన్ని జట్టు వైద్యులు పరిశీలిస్తున్నారని చెప్పుకొచ్చాడు."అతను బాగానే ఉన్నాడు. అతను కోలుకుంటాడని ఆశిస్తున్నాను. వైద్యులు గాయాన్ని చూస్తున్నారు, కానీ అతను బాగానే ఉంటాడని ఆశిస్తున్నాను" అని రాథోర్ విలేకరుల సమావేశంలో అన్నారు. నెట్ సెషన్ ముగిసే సమయానికి గాయం అయింది. ఒకవేళ రాహుల్ టెస్టు ఆడలేకపోతే, సిరీస్‌కు ముందు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన వెటరన్ చెతేశ్వర్ పుజారా భుజాలపై కెప్టెన్సీ భారం పడవచ్చు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో రెండో స్థానంలో నిలిచే అవకాశాలను మరింత మెరుగుపరుచుకునేందుకు భారత్ రెండో టెస్టులో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో నిలవాలంటే ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం టీమిండియాకు చాలా కీలకం. ఈ సిరీస్ నెగ్గ వన్డే సిరీస్ ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. గాయంతో జట్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులోకి రాలేదు. దాంతో కేఎల్ రాహులే జట్టును నడిపిస్తూ వస్తున్నాడు.