అదరగొట్టిన హిట్ మ్యాన్, వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ

ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. కొంతకాలంగా పరుగుల ఛేదనలో విఫలమవుతున్న హిట్ మ్యాన్ అద్భుతమైన సెంచరీ చేశాడు.

By Knakam Karthik  Published on  9 Feb 2025 9:26 PM IST
అదరగొట్టిన హిట్ మ్యాన్, వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ

ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. కొంతకాలంగా పరుగుల ఛేదనలో విఫలమవుతున్న హిట్ మ్యాన్ అద్భుతమైన సెంచరీ చేశాడు. 76 బంతుల్లో 7 సిక్స్‌లు, 9 ఫోర్లతో సెంచరీ చేశాడు. రోహిత్‌కు వన్డే మ్యాచుల్లో ఇది 32వ సెంచరీ కాగా..మరో వైపు వన్డేల్లో రోహిత్ శర్మకి రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. దాదాపు 16 నెలల తర్వాత శతకం బాదడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

హిట్‌మ్యాన్‌ చాలాకాలం తర్వాత తనదైన శైలిలో మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ఆదిల్ రషీద్ వేసిన 25.2 ఓవర్‌కు సిక్స్ బాది మూడంకెల స్కోరు అందుకున్నాడు రోహిత్‌. అంతేకాదు.. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాధిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచారు. వన్డేల్లో 336 సిక్స్‌లు కొట్టిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్‌(331)ను దాటి రెండో స్థానానికి చేరుకున్నారు. 351 సిక్స్‌లతో పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది మొదటి స్థానంలో ఉన్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో మొదటినుంచి రోహిత్ శర్మ నిలకడగా ఆడాడు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 -2025 టోర్నమెంట్ నుంచి ఇప్పటివరకు రోహిత్ శర్మ గొప్పగా ఆడటమే కాదు.. పర్వాలేదు అనిపించిన మ్యాచ్ కూడా లేదు. దీంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఒకానొక దశలో రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అని కూడా కొన్ని కథనాలు వచ్చాయి. వాటన్నింటికీ ఇవాళ సెంచరీతో రోహిత్ సమాధానం చెప్పారని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Next Story