మూడేళ్ల వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు.. కానీ అనీష్ ఏం చేశాడో తెలుసా.?
చాలా మంది చిన్న పిల్లలు మూడేళ్ల వయసులో పెప్పా పిగ్ లేదా ఛోటా భీమ్ వంటి కార్టూన్‌లలో మునిగిపోతారు లేదా బొమ్మలతో ఆడుకుంటారు.
By Kalasani Durgapraveen Published on 2 Nov 2024 9:49 AM ISTచాలా మంది చిన్న పిల్లలు మూడేళ్ల వయసులో పెప్పా పిగ్ లేదా ఛోటా భీమ్ వంటి కార్టూన్‌లలో మునిగిపోతారు లేదా బొమ్మలతో ఆడుకుంటారు. ఆ వయసులో అనీష్ సర్కార్ చెస్ పావులతో ఎత్తుగడలు వేస్తున్నాడు. ఇది మాత్రమే కాదు.. కేవలం మూడు సంవత్సరాల ఎనిమిది నెలల 19 రోజుల వయస్సులో.. శుక్రవారం ఉత్తర కోల్‌కతాలోని కైఖలీకి చెందిన ఈ బాలుడు చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఆటగాడిగా నిలిచాడు.
జనవరి 26, 2021న జన్మించిన అనీష్ అక్టోబరులో వెస్ట్ బెంగాల్ స్టేట్ అండర్-9 ఓపెన్‌తో తన చెస్ అరంగేట్రం చేశాడు. అక్కడ అతడు 8కి 5.5 స్కోర్ చేసి 24వ స్థానంలో నిలిచాడు. ఆరవ్ ఛటర్జీ, అహిలన్ బైశ్యా అనే ఇద్దరు రేట్ ప్లేయర్‌లను ఓడించాడు. బెంగాల్ ర్యాపిడ్ రేటింగ్ ఓపెన్ సమయంలో అనీష్ భారత్ నంబర్ 1, ప్రపంచ నంబర్ 4 గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసితో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడే అవకాశాన్ని పొందాడు.
దీని తర్వాత అనీష్ సర్కార్‌కు పశ్చిమ బెంగాల్ స్టేట్ అండర్-13 ఓపెన్‌లో ఆడే అవకాశం లభించింది. ఆ టోర్నీలో అతనికి ఐదుగురు రేటింగ్ ఉన్న ఆటగాళ్లతో తలపడే అవకాశం లభించింది. ఈ విధంగా అనీష్ FIDE రేటింగ్స్‌లో 1555 ప్రిలిమినరీ రేటింగ్‌ను పొందాడు. భారత రెండో గ్రాండ్ మాస్టర్ దిబ్యేందు బారువా అకాడమీలో అనిష్ చెస్ ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు.
అరిగస్సీ, ఆర్ ప్రజ్ఞానానంద, డి గుకేష్ వంటి యువ ప్రతిభావంతులు అంతర్జాతీయ స్థాయిలో మెరుస్తున్న సమయంలో భారతదేశం చెస్‌లో అద్భుతమైన యుగాన్ని చూస్తున్న సమయంలో అనీష్ కూడా ఆకట్టుకోవడం మంచి పరిణామం. ఇటీవల చెస్ ఒలింపియాడ్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్‌కు చారిత్రాత్మకమైన బంగారు పతకాలు అందాయి. వీరి విజయం ప్రపంచ చెస్ వేదికపై భారతదేశానికి స్థానం తీసుకురావడమే కాకుండా.. అనిష్ వంటి యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది.
అనీష్ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులకు చెస్‌తో సంబంధం లేదు. ఏడాది క్రితమే అనీష్ ఈ గేమ్ ఆడటం ప్రారంభించాడు. నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ అనీష్‌కు ఆదర్శం అని చెబుతుంటాడు.