చెన్నైలోని చెపాక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమి దిశగా పయనిస్తోంది. భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన భారత జట్టు లంచ్ విరామానికి ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో ఉంది. కెప్టెన్ కోహ్లీ 45, అశ్విన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంకా 276 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్న ప్రస్తుత సమయంలో భారత్ విజయం సాధించడం చాలా కష్టం. కనీసం డ్రా చేసుకోవాలన్న ఇంకో 64 ఓవర్లు(రెండు సెషన్లు) వికెట్లు కాపాడుకోవాల్సి ఉంది.
ఒక వికెట్ నష్టానికి 39 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొలి సెషన్‌లో మరో 105 పరుగులు మాత్రమే జోడించి ఐదు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (50) ఒక్కడే అర్థశతకంతో రాణించాడు. పుజారా 15, అజింక్యా రహానె 0, రిషభ్ పంత్ 11, వాషింగ్టన్ సుందర్ 0 పరుగులకే ఔటయ్యారు. అండర్సన్ మూడు వికెట్లు తీయగా.. లీచ్ రెండు, బెస్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ తొలి ఇన్సింగ్స్‌లో 578, రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులు తీసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది.