ఘ‌నంగా భార‌త క్రికెట‌ర్ విజ‌య్ శంక‌ర్ వివాహం

All rounder Vijay Shankar marries Vaishali Visweswaran.భార‌త జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ ఓ ఇంటివాడ‌య్యాడు. త‌మిళ‌నాడుకే చెందిన వైశాలీ విశ్వేశ్వ‌ర‌న్‌ను చెన్నైలో పెళ్లి చేసుకున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2021 10:58 AM IST
cricketer Vijay Shankar marriage

భార‌త జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ ఓ ఇంటివాడ‌య్యాడు. త‌మిళ‌నాడుకే చెందిన వైశాలీ విశ్వేశ్వ‌ర‌న్‌ను చెన్నైలో పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి హ‌డావుడి లేకుండా క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ.. అతి కొద్ది మంది కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య ఈ వివాహ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. కాగా.. గ‌తేడాది ఆగ‌స్టులో నిశ్చితార్థం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

విజ‌య్‌శంక‌ర్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(ఎస్ఆర్‌హెచ్‌) త‌రుపున ఆడుతున్నాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు అత‌డికి శుభాకాంక్ష‌లు తెలిపింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజయ్' అంటూ విషెస్ తెలియ‌జేసిన స‌న్‌రైజ‌ర్స్ ఆరెంజ్ ఆర్మీ అనే ట్యాగ్ ఇవ్వ‌డం విశేషం. వివాహ బంధంతో ఓ ఇంటివాడైన విజ‌య్ శంక‌ర్‌కు టీమిండియా ఆట‌గాళ్లు కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహ‌ల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు శుభాకాంక్ష‌లు తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కూడా విజయ్ శంకర్‌కు విషెస్ తెలియజేస్తున్నారు.


2018లో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు విజ‌య్‌శంక‌ర్‌. ఆ మరుసటి ఏడాదే ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో వన్డే కెరీర్‌ను ఆరంభించాడు. ఇంగ్లండ్ వేదికగా 2019లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లోనూ ఆడాడు. కానీ గాయంతో అర్థాంతరంగా టోర్నీ నుంచి త‌ప్పుకున్నాడు. భారత్ తరఫున 12 వన్డేలు ఆడి 223 పరుగులతో పాటు 4 వికెట్లు తీశాడు. 9 టీ20ల్లో 101 రన్స్‌తో పాటు 5 వికెట్ల పడగొట్టాడు.


Next Story