ఇక అంతా అఫ్గానిస్థాన్‌ చేతుల్లోనే.. గెలవండిరా నాయనా

All Indian eyes on Afghanistan-New Zealand match.సాధార‌ణంగా అయితే అఫ్గానిస్థాన్‌తో న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఆడుతుంటే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Nov 2021 10:10 AM IST
ఇక అంతా అఫ్గానిస్థాన్‌ చేతుల్లోనే.. గెలవండిరా నాయనా

సాధార‌ణంగా అయితే అఫ్గానిస్థాన్‌తో న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఆడుతుంటే స‌గ‌టు భార‌త అభిమాని పెద్ద‌గా ప‌ట్టించుకునేవాడు కాదు. అయితే.. నేడు ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌రుగునున్న పోరులో అఫ్గానిస్థాన్ విజ‌యం సాధించాల‌ని 130 కోట్ల మంది భార‌తీయులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ గెలిస్తేనే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా సెమీస్ చేరే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ కివీస్ క‌నుక విజ‌యం సాధిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండా నేరుగా సెమీస్‌కు చేర‌నుంది. అప్పుడు అఫ్గానిస్థాన్‌తో పాటు టీమ్ఇండియా ఇంటి ముఖం ప‌డుతాయి. ఇప్ప‌టికే గ్రూప్‌-1 నుంచి ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు సెమీస్ చేర‌గా.. గ్రూప్‌-2లో పాకిస్థాన్ జ‌ట్టు సెమీస్ బెర్తును ఖ‌రారు చేరుకుంది. మిగిలిన ఒక్క స్థానం కోసం టీమ్ఇండియా, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్ లు పోటిప‌డుతున్నాయి. నేడు జ‌రిగే పోరుతో మిగిలిన సెమీస్ బెర్త్ ఖరారు కానుంది.

దాదాపుగా ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టుకు ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడు వ‌చ్చిఉండ‌దేమో. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవ‌లం రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన కోహ్లీసేన నాలుగు పాయింట్ల‌తో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. ఒక‌వేళ కివీస్ క‌నుక ఈ మ్యాచ్‌లో గెలిస్తే 8 పాయింట్ల‌తో ముందంజ వేస్తుంది. భార‌త క‌థ ముగిన‌ట్లే.. న‌మీబియాతో చివ‌రి మ్యాచ్ నామ‌మాత్రం అవుతుంది. ఆ మ్యాచ్‌లో భార‌త్ గెలిచినా.. ఆరు పాయింట్లే అవుతాయి. అందుక‌నే నేడు అఫ్గాన్ సంచ‌ల‌నం సృష్టిస్తే.. భార‌త్ సెమీస్ అవ‌కాశాలు స‌జీవంగా ఉంటాయి.

అయితే.. ప్రస్తుత ఫాం దృష్ట్యా అఫ్గానిస్తాన్‌ చేతిలో న్యూజిలాండ్‌ ఓడిపోయే అవకాశాలు చాలా తక్కువగానే క‌నిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌ పేస్‌ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌ ముందు అఫ్గానిస్తాన్‌ ఏమేరకు నిలుస్తుందో వేచి చూడాలి. అయితే.. త‌న‌దైన రోజున ఎంత పెద్ద జ‌ట్టునైనా ఓడించే సత్తా అఫ్గానిస్థాన్ జ‌ట్టుకు ఉంది. ఇక టీ20ల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు కాబ‌ట్టి.. అఫ్గాన్ గెల‌వాల‌ని ప్ర‌తీ భార‌తీయుడు కోరుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టి20ల్లో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌ ముఖాముఖిగా తొలిసారి తలపడనున్నాయి.

Next Story