చాహల్ ఫైల్ క్లోజ్.. చివరి మ్యాచ్ ఆడేశాడు..!

34 ఏళ్ల భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెల‌క్ట‌ర్లు జట్టులోకి ఎంపిక చేయలేదు.

By Medi Samrat  Published on  22 Jan 2025 3:08 PM IST
చాహల్ ఫైల్ క్లోజ్.. చివరి మ్యాచ్ ఆడేశాడు..!

34 ఏళ్ల భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెల‌క్ట‌ర్లు జట్టులోకి ఎంపిక చేయలేదు. ఒకప్పుడు లీడింగ్ వైట్ బాల్ బౌలర్‌గా ఉన్న చాహల్ విషయంలో ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన మారింది. ఇదిలా ఉంటే.. చాహల్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడాడని భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు ఎంపికపై ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. యుజ్వేంద్ర చాహల్ కెరీర్ పూర్తిగా ముగిసిందని చెప్పాడు. అతడి ఫైల్ మూసివేయబడింది.. ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదని వ్యాఖ్యానించాడు.

ఇటీవలి విజయ్ హజారే ట్రోఫీలో చాహల్‌ను హర్యానా జట్టు విస్మరించగా.. ఐపీఎల్ 2025 వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. వేలంలో చాహల్‌.. అత్యంత ఖరీదైన స్పిన్నర్‌గా నిలిచాడు. 2023 నుంచి చాహల్ భారత్ తరఫున ఆడలేదు.

యుజ్వేంద్ర చాహల్ భారత్ త‌రుపున‌ తన చివరి మ్యాచ్ ఆడాడని.. బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ చాహల్ కెరీర్‌ను ముగించార‌ని చోప్రా అన్నాడు. చోప్రా భారత వన్డే జట్టు గురించి మాట్లాడాడు.. పేలవమైన ప్రదర్శన చేయనప్పటికీ, యుజ్వేంద్ర చాహల్‌ను తొలగించినట్లు చెప్పాడు.

యుజ్వేంద్ర చాహల్ ఫైల్ క్లోజ్ అయ్యింది. వారు (టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ) ఎందుకు ఇలా చేశారో నాకు తెలియదు.. ఇది ఆసక్తికరమైన కేసు.. అతడు చివరిగా జనవరి 2023లో ఆడాడు. అలా అతడు వెళ్ళిపోయి రెండేళ్లు అయింది. అతని గణాంకాలు కూడా చాలా బాగున్నాయి. అతడు చాలా వికెట్లు తీసుకున్నాడు.. నిలకడగా రాణిస్తున్నాడు. అత‌నికి అవ‌కాశాలు రాక‌పోవ‌చ్చ‌ని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య‌లపై ఇప్పుడు నెట్టింట చ‌ర్చ జ‌రుగుతుంది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.

Next Story