వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2023 ఫైనల్‌కు భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే మళ్లీ జట్టులోకి వచ్చాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు, అయితే వైస్ కెప్టెన్ పేరు మాత్రం ప్రకటించలేదు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 జూన్ 7-11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగనుంది. జూన్ 12 రిజర్వ్ డేగా ప్రకటించారు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు జట్టును ఎంపిక చేసిందని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది.
కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌లకు ఓపెనింగ్ బాధ్యతలను అప్పగించింది. మిడిలార్డర్‌లో అజింక్య రహానే తిరిగి వచ్చాడు. గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రహానే మంచి ఫామ్‌లో ఉన్నాడు. వికెట్ కీపర్ బాధ్యతలు కేఎస్ భరత్ కు దక్కాయి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ విభాగానికి బాధ్యత వహిస్తారు. అశ్విన్, జడేజా, పటేల్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ పాత్రను పోషించనున్నారు. పేస్ అటాక్‌కు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ నాయకత్వం వహిస్తారు.
భారత జట్టు తన చివరి టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాతో ఆడింది. ఈ సిరీస్‌ను భారత్ 2-1తో సమం చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా వరుసగా రెండోసారి అర్హత సాధించింది. చివరిసారి ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఈసారి భారత జట్టు చాంపియన్‌గా నిలుస్తోందో లేదో చూడాలి మరి.