ముంబైలోని వాంఖడే వేదికగా టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన మూడో బౌలర్ గా రికార్డులెక్కాడు. కివీస్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అజాజ్ పటేల్ ధాటికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు కుప్పకూలింది. భారత బాట్స్‌మెన్లలో మయాంక్ అగర్వాల్ (150; 311బంతుల్లో 17పోర్లు, 4సిక్సర్లు) భారీ శతకంతో సత్తాచాటగా.. స్పిన్నర్ అక్షర్ పటేల్(52; 128 బంతుల్లో 5 పోర్లు, 1 సిక్స్) టెస్టుల్లో తొలి అర్థశతకంతో రాణించాడు. భారత జట్టు అన్ని వికెట్లను కూడా అజాజ్ పటేల్(10/ 119) తీయడం విశేషం.
ముంబైలో పుట్టి..
అజాబ్ పటేల్ భారత్‌లోనే జన్మించాడు. ముంబైలోనే పుట్టినప్పటికి అతడి చిన్న తనంలోనే అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. కాగా.. నేడు తాను పుట్టిన గడ్డపైనే చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి 10 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా రికార్డులెక్కాడు. అతడి కంటే ముందు 1956లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్, 1999లో పాకిస్థాన్‌పై భారత్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మాత్రమే టెస్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన బౌలర్లు.