ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తన మొదటి వివాహం చేసుకున్న తర్వాత కేవలం 10 నెలలల్లో తన రెండవ వివాహంపై వచ్చిన పుకార్లకు స్వస్తి పలికాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన రషీద్ ఖాన్ ఛారిటీ ఫౌండేషన్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అతను సాంప్రదాయ ఆఫ్ఘన్ దుస్తులలో ఒక మహిళ పక్కన కూర్చున్నట్లు చూపించిన తర్వాత T20 కెప్టెన్ రెండవ వివాహం గురించి పుకార్లు మొదలయ్యాయి.
అయితే తన వ్యక్తిగత విషయాల గురించి గోప్యతను కోరుకుంటూ ఉన్నానని స్పష్టం చేసాడు. అక్టోబర్ 2024లో తన మొదటి వివాహం జరిగిన 10 నెలల తర్వాత ఆగస్టు 2న అతను తన రెండవ వివాహం చేసుకున్నాడు. అతని ముగ్గురు సోదరులు - అమీర్ ఖలీల్, జకీవుల్లా, రజా ఖాన్ కూడా అక్టోబర్ 3న కాబూల్‌లో వివాహం చేసుకున్నారు.
"ఆగస్టు 2, 2025న, నేను నా జీవితంలో ఒక కొత్త, అర్థవంతమైన అధ్యాయాన్ని ప్రారంభించాను. నా నిఖాను పూర్తి చేసుకున్నాను. నేను ఎల్లప్పుడూ ఆశించిన ప్రేమ, శాంతి, భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే స్త్రీని వివాహం చేసుకున్నాను. ఇటీవల నేను నా భార్యను ఒక ఛారిటీ కార్యక్రమానికి తీసుకెళ్లాను, అయితే అందుకు సంబంధించి ఊహాగానాలు మొదలవ్వడం చాలా దురదృష్టకరం. నిజం సూటిగా ఉంటుంది. ఆమె నా భార్య, మేము దాచడానికి ఏమీ లేదు" అంటూ వివరించాడు రషీద్ ఖాన్.