రోహిత్ కెప్టెన్సీ బాగుంటుంది.. అయితే ఆ తప్పు ఎందుకు చేశాడో
Aakash Chopra Feels Rohit Sharma Made An Error.పూర్తిస్థాయి టీ 20కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 18 Nov 2021 3:40 PM ISTపూర్తిస్థాయి టీ 20కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్నాడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు తరుపున వెంకటేశ్ అయ్యర్ అరంగ్రేటం చేశాడు. ఆల్‌రౌండర్‌గా అతడిని జట్టులోకి తీసుకున్నారు. అయితే.. ఒక్క ఓవర్ కూడా అతడికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ పరంగా ఒక అరుదైన తప్పిదం చేశాడని భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.
తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. భారత జట్టుకు ఆల్‌రౌండర్ అవసరం ఉంది. ఆరో బౌలర్‌గా అతడు సేవలందించాలి. అందుకనే ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే.. అతడికి కనీసం ఒక ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. నిజానికి రోహిత్ కెప్టెన్సీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అయితే.. తన నుంచి ఇలాంటి అరుదైన తప్పిదాన్ని ఊహించలేదు. వెంకటేశ్‌కు బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో తనకి అర్థం కావడం లేదని ఆకాశ్ చోప్రా అన్నాడు.
'రోహిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రారంభంలోనే కివీస్ వికెట్ కోల్పోయి పరుగులు చేసేందుకు తడబడుతోంది. అలాంటి సమయంలో వెంకటేశ్ చేత రెండు లేదా మూడు ఓవర్లు వేయించాల్సింది. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ ఎక్కువ పరుగులిచ్చిన నేపథ్యంలో వెంకటేశ్ సేవలను ఉపయోగించుకోవాల్సింది' అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందని.. అశ్విన్, భువి కలిపి కేవలం 47 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం ఆనందంగా ఉందన్నాడు.