ఐపీఎల్‌లో సొంత జట్టుకు ఆడని ఐదుగురు స్టార్ క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా.?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దేశవాళీ క్రికెటర్లు తమ సత్తా చాటేందుకు పుష్కలమైన అవకాశాలను పొందుతున్నారు.

By Medi Samrat  Published on  8 March 2024 4:03 PM GMT
ఐపీఎల్‌లో సొంత జట్టుకు ఆడని ఐదుగురు స్టార్ క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా.?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దేశవాళీ క్రికెటర్లు తమ సత్తా చాటేందుకు పుష్కలమైన అవకాశాలను పొందుతున్నారు. దేశవాళీ క్రికెట్ ఆడుతూనే ఐపీఎల్ ద్వారా ప్రపంచ క్రికెట్‌లో గుర్తింపు పొందిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే, ఐపీఎల్‌లో కొంతమంది ఆటగాళ్లు తమదైన ముద్ర వేసినప్పటికీ.. తమ సొంత జట్టుకు ఎప్పుడూ ఆడలేకపోయారు. అలాంటి ఐదుగురు భారతీయ ఆటగాళ్ల పేర్లను తెలుసుకుందాం.

1. విరాట్ కోహ్లీ

సొంత ఐపీఎల్ జట్టుకు ఆడే అవకాశం లేని ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు. కోహ్లి ఐపీఎల్‌ మొదటి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే ఉన్నాడు. ఇప్పటికీ అత‌డు RCBతోనే ఉన్నాడు. అయితే, 2008 వేలంలో అతని సొంత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ కోహ్లీని కొనుగోలు చేసే ప్ర‌య‌త్నం చేసింది. అయితే ఆ తర్వాత జట్టు ప్రదీప్ సాంగ్వాన్‌పై విశ్వాసాన్ని ప్రదర్శించింది.

2. దినేష్ కార్తీక్

తన సొంత జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడలేకపోయిన ఆటగాళ్లలో దినేష్ కార్తీక్ కూడా ఒకడు. 2022 వేలంలో కార్తీక్‌ను కొనుగోలు చేయడానికి CSK చాలా ప్రయత్నాలు చేసింది. జట్టు యాజ‌మాన్యం 5.25 కోట్ల రూపాయల వరకూ వేలం వేసింది. RCB చెన్నై కంటే ఎక్కువ వేలం వేయడం ద్వారా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ ను తమ జట్టులో చేర్చుకుంది. కార్తీక్ ఐపీఎల్‌లో ఆరు జట్లకు ఆడాడు. కానీ అతనికి తన రాష్ట్ర జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడే అవకాశం రాలేదు.

3. హర్భజన్ సింగ్

హర్భజన్ సింగ్ కూడా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడలేకపోయాడు. ఈ లీగ్‌లో భజ్జీ ముంబై ఇండియన్స్, కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. కానీ హర్భజన్ తన సొంత జట్టుకు ఆడే అవకాశం పొందలేకపోయాడు.

4. జస్ప్రీత్ బుమ్రా

ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎటాక్‌కి ప్రాణం పోసిన జస్ప్రీత్ బుమ్రా కూడా ఐపీఎల్‌లో తన రాష్ట్ర జట్టుకు ఆడలేకపోయిన ఆటగాళ్లలో ఒకడు. బుమ్రా గుజరాత్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు, అయితే అతనికి ఇంకా ఐపీఎల్‌లో ఈ జట్టుకు ఆడే అవకాశం రాలేదు.

5.శుభ్‌మాన్‌ గిల్

ఇంకా ఐపీఎల్‌లో తన సొంత జట్టుకు ఆడలేకపోయిన ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ కూడా ఒకడు. గిల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో KKR, గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు.. కానీ అతనికి పంజాబ్ కింగ్స్ తరపున ఆడే అవకాశం రాలేదు.

Next Story