క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి 'టైమ్ అవుట్' అయిన మాథ్యూస్.. మండిప‌డుతున్న అభిమానులు

ఢిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన‌ ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ 'టైమ్ అవుట్'గా

By Medi Samrat  Published on  7 Nov 2023 9:36 AM IST
క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి టైమ్ అవుట్ అయిన మాథ్యూస్.. మండిప‌డుతున్న అభిమానులు

ఢిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన‌ ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ 'టైమ్ అవుట్'గా ప్రకటించబడ్డాడు. సరైన సమయంలో బ్యాటింగ్ ప్రారంభించకపోవడంతో ఒక్క బంతి కూడా ఆడకుండానే ఓ బ్యాట్స్‌మెన్ ఔట్ అయ్యి పెవిలియన్‌కు చేరుకోవడం అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఏంజెలో మాథ్యూస్ టైమ్ అవుట్ క్రికెట్ అభిమానుల్లో కొత్త చర్చను ప్రారంభించింది. షకీబ్ అల్ హసన్ 'స్పోర్ట్స్ మాన్ షిప్'పై అభిమానులు ప్రశ్నలు సంధింస్తున్నారు. శ్రీలంక తరుపున సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్ చరిత్ అసలంక ఈ విషయంపై స్పందించాడు.

విరామ సమయంలో, చరిత్ అసలంక ప్రసారకర్తలతో మాట్లాడుతూ.. "మాథ్యూస్ అవుట్ కావడం క్రికెట్ స్ఫూర్తికి మంచిది కాదని నేను చెప్పాలి." సమరవిక్రమ ఔటైన తర్వాత మాథ్యూస్ మైదానంలోకి వచ్చాడు. అసలంకతో మాథ్యూస్ భాగస్వామి కావాలనుకున్నా అది కుదరలేదు. ఆ తర్వాత ధనంజయ్ వచ్చాడు. మాకు మంచి భాగస్వామ్యం కుదిరింది. ధనంజయ్ కుడిచేతి వాటం,యు నేను ఎడమచేతి వాటం అయినందున అతనితో భాగస్వామ్యం న‌మోదు నెల‌కొల్ప‌డం నాకు చాలా ఇష్టం. ధనంజయ్ ఎప్పుడూ వేగంగా స్కోర్ చేస్తాడని పేర్కొన్నాడు.

మ్యాచ్‌పై వ్యాఖ్యానిస్తూ బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అథర్ అలీ ఖాన్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాడు. “ఇది ఆటకు మంచిది కాదు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. "హెల్మెట్‌లో ఏదైనా లోపం ఉంటే దాన్ని పరిష్కరించడానికి వారికి కొన్ని అదనపు నిమిషాలు ఇవ్వాలని పేర్కొన్నాడు.



అయితే పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నిర్ణీత గడువులోగా సన్నద్ధంగా ఉండటమే బ్యాట్స్‌మెన్ విధి అని చెప్పాడు. కానీ అంపైర్ పరిస్థితిని పరిష్కరించాడు. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైంది. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కనీసం అరడజను సంఘటనలు జరిగాయి. 2017లో లోగాన్ కప్ మ్యాచ్‌లో జింబాబ్వేకు చెందిన చార్లెస్ కుంజే ఔట్ కావడం చూడ‌వ‌చ్చ‌ని అన్నాడు.

ఈ ఘటన మొత్తం 25వ ఓవర్‌లో జ‌రిగింది. సదీర సమరవిక్రమ వికెట్ పతనం తర్వాత.. శ్రీలంక మాజీ కెప్టెన్ మాథ్యూస్ మైదానంలోకి వచ్చాడు. కానీ బౌలర్ షకీబ్ అల్ హసన్ బంతులను ఎదుర్కొనే ముందు.. అతని హెల్మెట్ యొక్క చిన్‌స్ట్రాప్ విరిగిపోయింది. మాథ్యూస్ తన హెల్మెట్ తీసి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ మరో హెల్మెట్ అడిగాడు. వెంట‌నే షకీబ్ అల్ హసన్ అప్పీల్ చేశాడు. నిర్ణీత సమయం అన‌గా 2 నిమిషాల్లో బ్యాటింగ్ ప్రారంభించలేకపోవడంతో అంపైర్ మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు. దీంతో అత‌డు తీవ్ర నిరాశకు లోనైనాడు.


Next Story