IPL 2023 : ఇంతకు ముందులా కాదు.. ఈ సారి సరికొత్తగా ఐపీఎల్.. కొత్త నిబంధనలు ఇవే
నేటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం కానుంది
By తోట వంశీ కుమార్ Published on 31 March 2023 3:30 AM GMTఐపీఎల్ ట్రోఫీ ఆవిష్కరణలో జట్లు కెప్టెన్లు
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సిద్దమైంది. మరికొన్ని గంటల్లో సీజన్ 16కు తెరలేవనుంది. ఈ సారి లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఇంపాక్ట్ ప్లేయర్( Impact Player), టాస్ తరువాత తుది జట్టు ప్రకటన, వైడ్, నోబాల్‌లకు సమీక్ష వంటి కొన్ని కొత్త నిబంధనలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) తీసుకువచ్చింది. దీంతో ఈ సారి క్రికెట్ అభిమానులు మరింత ఎంటర్‌టైన్మెంట్ కావడం ఖాయం.
కొత్త నిబంధనలు ఇవే..
ఇంపాక్ట్ ప్లేయర్ : ఈ సీజన్‌లో అమల్లోకి రానున్న కొత్త నిబంధనల్లో అతి ముఖ్యమైనది ఇంపాక్ట్ ప్లేయర్. ఐపీఎల్‌లో ఇది ఇంకా అమల్లోకి రాకముందే ప్రస్తుతం దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. మ్యాచ్ సాగుతున్న సమయంలో తుది జట్టులోని ఒక ఆటగాడి స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో లేని మరో ఆటగాడితో భర్తీ చేసుకోవడమే ఇంపాక్ట్ ప్లేయర్ అంటారు. ఇందుకోసం మ్యాచ్ ఆరంభానికి ముందే తుది జట్టుతో పాటు నలుగురు సబ్‌స్టిట్యూట్‌లను ప్రకటించాలి. ఈ నలుగురిలోంచే ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది.
తుది జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురి కంటే తక్కువ ఉన్న సందర్భంలో తప్ప ఈ ఇంపాక్ట్ ఆటగాడిగా భారత క్రికెటర్‌నే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇన్నింగ్స్ ఆరంభించే ముందుగానీ లేదా ఓవర్ పూర్తి అయిన తరువాత గానీ లేదా వికెట్ పడిన అనంతరం లేదా ఓ బ్యాట్స్‌మెన్ రిటైర్ అయ్యాకే ఇంపాక్ట్ ఆటగాడు గ్రౌండ్‌లోకి రావాల్సి ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లో మ్యాచ్‌లో 11 మంది మాత్రమే బ్యాటింగ్ చేయాలి. బౌలింగ్ జట్టు అప్పటికే ఓ రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకుంటే సదరు ఆటగాడు తన పూర్తి ఓవర్ల కోటా అయిన నాలుగు ఓవర్లను వేసే అవకాశం ఉంటుంది.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే..? మ్యాచ్ జరుగుతున్న ఏ సమయంలోనైనా ఇంపాక్ట్ ఆటగాడిని బరిలోకి దింపొచ్చు. అయితే.. ఇంపాక్ట్ ప్లేయర్ కోసం గ్రౌండ్‌ను వీడిన క్రికెటర్ మళ్లీ మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు. ఇంపాక్ట్ ప్లేయరే మిగతా మ్యాచ్ మొత్తం కొనసాగాల్సి ఉంటుంది. ఈ నిబంధన మ్యాచ్‌ను అనూహ్య మలుపు తిప్పే అవకాశం ఉందని పలువురు క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
ఇక నుంచి టాస్ వేసిన తరువాతే తుది జట్టు
అంతర్జాతీయ క్రికెట్‌లో గానీ, ఐపీఎల్‌లో గానీ ఇప్పటి వరకు టాస్‌కు ముందే ఇరు జట్ల కెప్టెన్లు తమ తుది జట్టు జాబితాను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి అలా చేయాల్సిన పని లేదు. టాస్ వేసిన తరువాత తుది జట్టును ప్రకటించవచ్చు. టాస్ ప్రభావాన్ని తగ్గించేందుకే బీసీసీఐ ఈ నిబంధన తీసుకువచ్చింది. దీని వల్ల పిచ్ పరిస్థితి బట్టి టాస్ గెలిచిన కెప్టెన్ అదనంగా బౌలర్ లేదా బ్యాటర్‌ను తీసుకోవచ్చు. టాస్ ఓడిపోయిన సారథి కూడా పరిస్థితులకు తగ్గట్లు జట్టులో మార్పులు చేసుకోవచ్చు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా టీ20 లీగులో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు.
వైడ్, నో బాల్ కు రివ్యూ..
టీ20ల్లో ప్రతి పరుగు విలువైనదే. ఎన్నో సార్లు ఒక్క పరుగుతో ఓడిన జట్లను మనం చూశాం. కొన్ని సార్లు తీవ్ర ఒత్తిడిలో అంపైర్ల వైడ్లు, నోబాల్స్ విషయంలో పొరబాట్లు చేస్తుంటారు. దీని వల్ల జట్లు నష్టపోతుండడంతో పాటు కొన్ని సార్లు వివాదాలకు దారి తీశాయి. అందుకనే ఈ సీజన్ నుంచి వైడ్, నోబాల్ కూడా సమీక్ష కోరే అవకాశాన్ని జట్లకు కల్పించారు. మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశారు.
ఐదుగురికి బదులు నలుగురే
బౌలింగ్ జట్టు నిర్దేశిత సమయంలోగా బౌలింగ్ కోటా పూర్తి చేయకపోతే ఇక నుంచి భారీ పెనాల్టీ చెల్లించుకోకతప్పదు. నిర్దేశిత సమయం ముగిసిన తరువాత మిగిలిన ఓవర్లలో 30 యార్డ్ సర్కిల్ బయట ఐదుగురు పీల్డర్లకు బదులు నలుగురు మాత్రమే ఉంటారు. ఇక బంతిని వేసేటప్పుడు కీపర్ లేదా ఫీల్డర్లు దురుద్దేశపూర్వకంగా కదిలితే ఫీల్డింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తారు. అంతేకాకుండా ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు.
గ్రూపులోని జట్లతో ఒకటి, ఇంకో గ్రూపులోని జట్లతో రెండు మ్యాచ్‌లు
గత ఐపీఎల్ సీజన్ నుంచి మొత్తం 10 జట్లు పోటీపడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఫార్మాట్‌లో మార్పులు చేశారు. ఒక్కొ గ్రూపులో ఐదు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. లీగ్ దశలో ఓ జట్టు.. తమ గ్రూపులోని జట్లతో ఒక్కొ మ్యాచ్ ఆడనుండగా, పక్క గ్రూపులోని జట్లతో రెండేసి మ్యాచ్‌ల చొప్పున మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఉదాహరణకు గ్రూప్ బిలో ఉన్న చెన్నై జట్టు.. గ్రూప్ ఏలోని ముంబై, కోల్‌కతా, రాజస్థాన్, ఢిల్లీ, లఖ్‌నవూ జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. గ్రూప్ బిలోని జట్లు అయిన సన్‌రైజర్స్, ఆర్‌సీబీ, పంజాబ్, గుజరాత్ జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది.