విశ్రమించిన.. ఉత్తుంగ కెరటం..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 1 Sep 2020 6:06 AM GMTసంకీర్ణ ప్రకరణకు.. సంస్కరణల ప్రసరణకు ముందూ వెనక అతనే! అయిదడుగుల నాలుగు అంగుళాల ఎత్తు ఉన్నా దేశ రాజకీయాల్లో అతనో బాహుబలి! ఎలాంటి రాజకీయ సంక్షోభాలనైనా సులువుగా పరిస్కరించగల ట్రబుల్ షూటర్! బహుముఖ ప్రజ్ఞాశాలి.. బెంగాలీ బాబు.. ప్రణబ్‌దాగా అందరూ పిలుచుకునే మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దివంగతులయ్యారు. ఎనిమిది పదులు పైచిలుకు వయసులో అనారోగ్యంతో పోరాడుతూ కనుమూశారు.
తన చాణక్య చతురతతో రాజకీయంగా ఎన్నో చరిత్రలు సృష్టించిన ప్రణబ్‌దా ఇపుడు చరిత్రలో ఓ భాగంగా మారారు. మెదడులో రక్తం గడ్డ కట్టి, అనారోగ్యంతో ఆగస్టు 10న ఢిల్లీ ఆర్మీ రీసెర్చి రెఫరల్ ఆస్పత్రిలో చేరిన అతను కరోనాతో కూడా కలబడాల్సి వచ్చింది. 21 రోజులు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ప్రణబ్‌జీ సోమవారం కనుమూశారు. భారత్ రాజకీయాల్లో చెదరని ముద్ర వేసిన ప్రణబ్ õపేరు స్మరించకుండా వర్తమాన భవిష్యత్ రాజకీయాల గురించి ఎంత చర్చించినా విశ్లేషించినా అది అసంపూర్తిగానే మిగిలిపోక తప్పదు!!
సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన ప్రణబ్ జీవితం ఉవ్వెత్తున ఎగసిన ఓ ఉత్తుంగ కెరటం. పశ్చిమ బెంగాల్‌లోని బీర్బం జిల్లా మిరాటీలో 1935న జన్మించిన ప్రణబ్ ముఖర్జీ చిన్ననాటి నుంచే తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించే వారు. ప్రణబ్ తల్లి రాజ్‌లక్ష్మి ముఖర్జీ, తండ్రి కమద కింకర్ ముఖర్జీ. ప్రణబ్ తండ్రి స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. భారతజాతీయ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు.
ప్రణబ్ చరిత్ర, రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ చేశారు. ఎల్‌ఎల్‌బీ, డీలిట్ కూడా చేశారు. 1957లో సువ్రా ముఖర్జీని వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారులు అభిజిత్ , ఇంద్రజిత్...కూతురు శర్మిష్ట. తండ్రిలానే ప్రణబ్ కాంగ్రెస్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత 1966లో బెంగాల్ కాంగ్రెస్‌లో చేరారు. 1969,75,81,93,99లలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1980–85 కాలంలో రాజ్యసభానేతగా ఉన్నారు. 2004లో జాంగీపూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే ఏడు జూన్‌న లోకసభ నేతగా బాధ్యతలు స్వీకరించారు. 1973 నుంచి వరసగా వివిధ శాఖా సచివులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
పారిశ్రామిక, రవాణా సహాయ, ఆర్థిక శాఖ సహాయ, రెవిన్యూ, బ్యాంకింగ్ శాఖ, వాణిజ్య,ఉక్కు,గనుల శాఖ, ఆర్థికశాఖ, వాణిజ్య శాఖ, విదేశాంగ శాఖ, రక్షణశాఖ మంత్రిగా ఎన్నో బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించిన ఉజ్వల చరిత్ర ప్రణబ్‌జీది. 2012–17 దాకా భారత రాష్ట్రపతిగా తనదైన ముద్ర వేశారు.
చాలా మందికి పదవులు వన్నె తెస్తే.. ప్రణబ్ ముఖర్జీ తను చేపట్టిన పదవులకే వన్నె తెచ్చారు. జాతీయ, అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలు అందుకున్న మేధావి. కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉంటూ ప్రతిపక్షాలను ఒప్పించి మెప్పించడంలో ప్రణబ్‌ది అందివేసిన చేయి. అందుకే దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఈ అనర్ఘ్య రత్నకు లభించింది. అయిదు దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్‌గా అత్యుత్తమ సేవలందించారు. 2004–12 మధ్య పాలనా సంస్కరణలకు ప్రణబ్ శ్రీకారం చుట్టారు.
సమాచార హక్కు, ఉపాధి హక్కు తదితరాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మంత్రుల బృందానికి ఆయన నాయకత్వం వహించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల పంపకానికి సంబంధించిన గాడ్గిల్–ముఖర్జీ ఫార్ములా తనే రూపొందించారు. దేశ ఆర్థికరంగం, దేశ నిర్మాణాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు రచించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండు దశాబ్దాలపాటు ఉన్నారు.
స్వతంత్ర భావాలున్న ప్రణబ్‌జీ ఏ ఒక్క చట్రంలో ఇమడానికి ఇష్టపడేవారు కాదు. తాను సరి అనుకున్నదాన్ని ఎవరు ఎలా అనుకున్నా చేయగలిగే సత్త ఉన్నవారు. ప్రణబ్‌జీ రాష్ట్రపతి పదవీ విరమణానంతరం నాగపూర్‌లోని ఆర్.ఎస్.ఎస్. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా వెళ్ళి ప్రసంగించారు.
ఆర్.ఎస్.ఎస్. ఆహ్వానాన్ని స్వీకరించరాదని కాంగ్రెస్ వర్గీయులే ఎన్నో విమర్శలు గుప్పించారు. ప్రణబ్‌జీ తను అనుకున్నదే చేశారు. అదే ఆయన ప్రత్యేకత!క సమావేశంలో లౌకిక వాదంతో మిళితమైనద మన విశ్వాసం. బహుళ సంస్కృతిని గౌరవించే దేశం మనది అంటూ ప్రణబ్ చేసిన ప్రసంగం చివరికి కాంగ్రెస్ వర్గీయులను కూడా ఆకట్టుకుంది.
పుస్తకప్రేమిగా ఉన్న ప్రణబ్‌జీకు డైరీ రాయడం అలవాటు. నిత్యం ఎంత బిజీగా ఉన్నా కనీసం రోజుకో పేజీ అయినా రాసేవారు. గత 40 ఏళ్ళలో ఎప్పుడూ ఈ అలవాటుకు అవాంతరం కలగనీయలేదు. రాష్ట్రపతిగా ముఖర్జీ తనదైన ముద్ర వేశారు. రాష్ట్రపతి పదవి రబ్బర్ స్టాంపు కాదని తన ఆచరణల ద్వారా నిరూపించారు. రాజ్యాంగ పరిధికి లోబడే ప్రభుత్వ విధానాలను సునిశితంగా విమర్శించేవారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టిన ముఖర్జీ భాజపా వచ్చాక కూడా కొనసాగారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా తన తీరును మాత్రం ఆయన మార్చుకోలేదు. సాధారణంగా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పలువురు అర్జీలు సమర్పిస్తుంటారు.
అయితే ముఖర్జీ ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. నేరాలకు ఒడిగట్టినవారిని క్షమించడమేంటి అనుకునేవారు. ఆయన తన పదవీ కాలలో 30 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. రాష్ట్రపతి కార్యాలయాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ప్రణబ్ ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాదు రాష్ట్రపతిని గౌరవంగా హిజ్ ఎక్సలెన్సీ అని సంబోధించే పదాన్ని కూడా ఈయన హయాంలోనే తొలగించారు. రాష్ట్రపతి భవన్ పర్యాటక ప్రాంతంగా మార్చడంలో ఆయన ప్రమేయం మరవరానిది.
ఎంత ఎత్తుకు ఎదిగిన మన మూలాలను మరవరాదన్నది ప్రణబ్‌దాకు బాగా వంటబట్టిన సత్యం. అందుకే ఈ పల్లెటూరి అబ్బాయి ఏటా దసరా ఉత్సవాలకు తప్పనిసరిగా స్వగ్రామానికి సకుటుంబంగా వెళ్లేవారు. అందుకే ఆ ఊరిలో ఈ పండగను చాలా ప్రత్యేకంగా ఆచరించేవారు. స్వగ్రామంలో తన పూర్వీకుల ఇంటిలో పెరిగిన ప్రణబ్‌కు ఆ ఇల్లన్నా.. ఊరన్నా ఎక్కడ లేని మమకారం.
తన యాసను. బాసను మరచిపోలేని విజ్ఞాని ఆయన. చివరికి ఇంగ్లిష్‌ను కూడా బెంగాలీ యాసలోనే ఉచ్చరించేవారు. ఓ సారి ఇందిరాగాంధీ మీరు ఇంగ్లిష్ ఉచ్చారణ మెరుగుపరచుకునేందుకు శిక్షణ తీసుకోండి అంటే...నాకు ఈ బెంగాలీ యాసలో పలకడమే సౌకర్యంగా ఉందని చెప్పారట! స్వభాషపై అభిమానం అంటే ఇలా ఉండాలి.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ప్రణబ్ ముఖర్జీ నిగర్వి. తన సంస్కృతి, భాషలపై ఎనలేని మమకారం ఉన్నవారు. చరిత్ర పుటల వివరాలన్నీ ఆయన నాలికపై నాట్యమాడేవి. అందుకే పార్లమెంట్‌లో ఎలాంటి విషయన్నైనా తేదీలతో సహా గత విషయాలను కోట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరచేవారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ తనదంటూ ఓ ఆనవాలును...తనకంటూ ఓ అస్తిత్వాన్ని ప్రకటించుకున్న ప్రణబ్‌జీ మనకే కాదు ముందు వందతరాలకు స్మరణీయులే!!